 
															నేటి అర్ధరాత్రి నుంచి ‘ఉత్తర’ దర్శనం
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లను తిరుపతి తిరుమల దేవస్థానం సిద్ధం చేసింది.
	వైకుంఠ ఏకాదశికి తిరుమల సిద్ధం   
	 అన్ని రకాల ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు
	 సాక్షి,తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లను తిరుపతి తిరుమల దేవస్థానం సిద్ధం చేసింది. సర్వదర్శనం, కాలిబాట భక్తుల దివ్య దర్శనం, వీఐపీ దర్శనం, నిర్దేశిత దర్శన సమయాలు, భక్తులను అనుమతించే వేళలను ప్రకటించింది. అవసరాన్ని బట్టి అరగంట అటుఇటుగా దర్శనానికి అనుమతిస్తామని ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. ఆ వివరాలు..
	     ఏకాదశి, ద్వాదశి రోజుల్లో ప్రముఖులను వేకువజామున 1.30 గంటల     నుంచి దర్శనానికి అనుమతిస్తారు. అందరికీ లఘు దర్శనం మాత్రమే. ఒక్కో వీఐపీ తరఫున ఆరుగురిని మాత్రమే అనుమతిస్తారు.  
	     కాలిబాటల్లో వచ్చే భక్తులకు శుక్రవారం మ.2 గంటలకు అలిపిరి మార్గంలోని గాలిగోపురం వద్ద, శ్రీవారి మెట్టు మార్గాల్లో రెండు రోజులకు కలిపి మొత్తం 40 వేల టికెట్లు ఇస్తారు. వీరిని శుక్రవారం అర్ధరాత్రి తర్వాతే క్యూలోకి అనుమతిస్తారు. శనివారం ఉ.7 గంటల తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు.
	 
	     సర్వదర్శనం భక్తులకు శనివారం ఉ.7 గంటల నుంచి దర్శనం  ప్రారంభమవుతుంది.
	     కరెంట్ బుకింగ్‌లో రూ.300 టికెట్ల దర్శనాన్ని రద్దు చేశారు. 12వ తేదీన     5వేల వరకు రూ.300 టికెట్లు కేటాయించనున్నారు.  
	     సుదర్శనం, వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనంతోపాటు అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేశారు.
	     తిరుపతిలోని రెండు టీటీడీ వసతి సముదాయాల్లో రెండు పూటలా ఉచిత అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు పూర్తిచేశారు. కాలిబాటల్లో నడిచివచ్చే భక్తులకు ఒక్కో ఉచిత లడ్డూ అందజేయనున్నారు.
	
	 భద్రాద్రిలోనూ సర్వం సిద్ధం
	 భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వైకుంఠ ఏకాదశికి సర్వసిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం  తెప్పోత్సవం జరగనుండగా శనివారం తెల్లవారుజామున ఉత్తరద్వార దర్శనం ప్రారంభిస్తారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
