రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు

Tirumala Formar head priest Ramana Dikshitulu alleges irregularities in TTD - Sakshi

తనపై టీటీడీ అధికారులు కక్షగట్టి దుష్ప్రచారం చేస్తున్నారు

అక్రమాస్తులు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారు

సీబీఐ విచారణకు సిద్ధం.. టీటీడీలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలి

మీడియా సమావేశంలో రమణ దీక్షితులు వ్యాఖ్యలు

సాక్షి, తిరుపతి : తాను సామాన్య అర్చకుడిని అని, పుట్టకముందే శ్రీవారు తనను అర్చకుడిగా నియమించుకున్నారని, తాను మరణించేవరకూ స్వామివారికి సేవ చేస్తానని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అన్నారు.  ఆయన సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ‘నాకు ప్రమోషన్లు ఉండవు. సెలవులు ఉండవు. అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఉండవు.. రిటైర్మెంట్‌ ఉండదు. నా జీవితమంతా శ్రీవారి సేవలోనే గడుపుతాను’అని ఆయన అన్నారు. శ్రీవారి వైభవాన్ని కాపాడటమే తన లక్ష్యమని చెప్పారు. 20 ఏళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారని తనపై అభియోగాలు మోపుతున్నారని, ఎంతోమంది జేఈవో అధికారుల పర్యవేక్షణలో టీటీడీ కొనసాగిందని, కొందరు అర్చకులంటే చులకనగా చూసేవారని అన్నారు.

వంశపారంపర్య అర్చకులను దేవాలయంలోనే లేకుండా చేయాలని కొందరు చూశారని, ఈ అవమానాలను, అరాచకాలను 24 ఏళ్లుగా భరిస్తూ వచ్చానని ఆయన అన్నారు. బాలసుబ్రహ్మణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజు జేఈవోలుగా వచ్చారని, బాలసుబ్రహ్మణ్యం రోజు తనకు 50 రూపాయలు కూలీ ఇచ్చేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. నెలకు ఎన్ని రోజులు పనిచేస్తానో అన్ని రోజులే కూలీ ఇచ్చేవారని అన్నారు. కొన్నాళ్ల తర్వాత అర్చకుల జీతాలను రూ. మూడువేలు చేశారని, రోశయ్య హయాంలో రూ. 60వేలు వేతనంగా ఇచ్చారని, అదే మొన్నటివరకు తాను అందుకున్న వేతనమని తెలిపారు.

జేఈవోలుగా పనిచేసిన బాలసుబ్రమణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజు  టీటీడీకి పట్టిన ఏలినాటి శని లాంటి వారని ఆయన ఆరోపించారు. ‘బాలసుబ్రహ్మణ్యం హయాంలో వెయ్యికాళ్ళ మండపాన్ని కూల్చివేశారు. ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన, సుందరమైన, అపురూపమైన వెయ్యికాళ్ల మండపాన్ని కాపాడాలి అని అనేకసార్లు తాను వినతి పత్రం ఇచ్చాను. వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వెయ్యి కాళ్లం మండపాన్ని కాపాడేందుకు నేను ఎంతో పోరాటం చేశాను. అక్కడ ఉత్సవాలు జరగడం లేదు కదా.. తీసేస్తే నష్టమేంటన్నారు. 800 ఏళ్ల చరిత్ర కలిగిన వెయ్యి కాళ్ల మండపాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పినా.. నిర్దయగా దానిని కూల్చివేశారు. ఇప్పుడు ఆ వేయి స్తంభాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తే బాధగా ఉంటోంది. వెయ్యికాళ్ల మండపానికి అనువుగా పునర్నిర్మాణానికి కృషి చేశా. కానీ బాలసుబ్రహ్మణ్యం దానికి ఒప్పుకోలేదు. చివరికీ నాపై కక్షగట్టి నాకు వంశపారంపర్యంగా వచ్చిన ఇల్లును కూడా కూల్చేశారు. నాకు నిలువ నీడ లేకుండా చేశారు. బాలసుబ్రహ్మణ్యం చట్టవిరుద్ధ కార్యాలతో డబ్బు సంపాదించుకున్నారు. వ్యసనాలకు బానిస అయ్యారు. అర్చకులను ఒరేయ్‌, పోరా అని సంభోదిస్తూ.. నిత్యం హింసించేవారు. బాలసుబ్రహ్మణ్యం వారసుడు మరో జేఈవో ధర్మారెడ్డి. ధర్మారెడ్డి హయాంలోనే నాపై రెండుసార్లు హత్యాయత్నం జరిగిందన్నారు. మరో జేఈవో శ్రీనివాసరాజు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీనివాసరాజు అవినీతి, అక్రమాల పుట్ట గురించి అందరికీ తెలుసు. అర్చకులను బెదిరించి పూజలు చేయించిన ఘనత శ్రీనివాసరాజుది. పనివాడి కన్నా హీనంగా ఆయన అర్చకులను చూసేవారు. ప్రతిరోజు శ్రీవారి సన్నిధిలో శ్రీనివాసరాజుకు పనేంటి? నాపై వ్యంగ్యమైన ఛలోక్తులు విసిరి అవమానించేవారు’ అని అని రమణ దీక్షితులు అన్నారు.

టీటీడీ ఆలయంలో నిధులు ఉన్నాయని బ్రిటిష్‌ మ్యానువల్‌ చాలా స్పష్టంగా రాసి ఉందని, ప్రతాపరుద్రుడు శ్రీవారికి సమర్పించిన అత్యంత అమూల్యమైన బంగారు నగలు నేలమాళిగల్లో ఉన్నాయని, ఆ నిధుల కోసం తవ్వకాలు జరిగాయని రమణ దీక్షితులు వెల్లడించారు. ఆ అక్రమాలను బయటపెట్టినందుకే కక్షగట్టిన అధికారులు, నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అనాదిగా సంక్రమించిన ఆస్తులు తనకు ఉన్నాయని, అక్రమంగా సంపాదించిన ఆస్తులు తనకు లేవని స్పష్టం చేశారు. తనకు అక్రమ ఆస్తులు ఉన్నాయని కొందరు అధికారులు సోషల్ మీడియాలో కావాలనే ఆరోపణలు చేస్తున్నారని, ఈ విషయంలో సీబీఐ దర్యాప్తుకు సైతం తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. టీటీడీలో అక్రమ తవ్వకాలు, అవకతవకలు, తప్పులు చేస్తున్న అధికారులపై సీబీఐ దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు 10 రూపాయల అక్రమార్జన ఉన్నా సీబీఐ విచారణకు సిద్ధమని, ఎలాంటి శిక్షకైనా సిద్ధమని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top