
ముగ్గుర్ని బలిగొన్న అతివేగం
జాతీయ రహదారిపై కొవ్వలి వంతెన సమీపంలో శనివారం ఉదయం ఆగివున్న లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా,
దెందులూరు/ఏలూరు (వన్ టౌన్) : జాతీయ రహదారిపై కొవ్వలి వంతెన సమీపంలో శనివారం ఉదయం ఆగివున్న లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయూలయ్యూయి. దెందులూరు ఎస్సై కట్టా వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన ఏడుగురు వ్యక్తులు తీర్థయూత్ర చేసేందుకు కారులో బయలుదేరారు. శనివారం ఉదయం దెందులూరు సమీపంలో జాతీయ రహదారిపై లారీని ఆపి జారిపోరుున బరకాన్ని డ్రైవర్, క్లీనర్ కడుతుండగా, వెనుకనుంచి అతివేగంగా వచ్చిన ఆ కారు ఢీకొట్టి నుజ్జు నుజ్జయ్యింది.
ఇండోర్ జిల్లా చెనోరు గ్రామానికి చెందిన కారు డ్రైవర్ మురళీలాల్(46), మధుసింగ్ (54) అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంలో ఉన్న నలుగురితోపాటు లారీపై బరకం కడుతున్న వ్యక్తి రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆ ఐదుగుర్ని 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏలూరులో చికిత్స పొందుతూ రామేశ్వర్ మీనర్ అనే వ్యక్తి మృతి చెందాడు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ తరలించారు. క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.