
చీకటిలో తెల్లారిన బతుకులు
అప్పటి వరకూ సంతోషంగా గడిపిన ఆ మిత్రులను రోడ్డు ప్రమాదం బలిగొంది. మూడు పదుల్లోనే నూరేళ్లు నిండి పోయాయి. వారి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పీఎన్‌కాలనీ, న్యూస్‌లైన్: అప్పటి వరకూ సంతోషంగా గడిపిన ఆ మిత్రులను రోడ్డు ప్రమాదం బలిగొంది. మూడు పదుల్లోనే నూరేళ్లు నిండి పోయాయి. వారి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాద వివరాల్లోకి వెళితే...శ్రీకాకుళం పట్టణంలో బలగ జంక్షన్‌లో బుర్ర రమేష్ (30), ఫ్రెండ్స్ ఫోటోస్టూడియా నిర్వహిస్తున్నాడు. బద్రి జగదీష్ (30), ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా, శ్రీను (28) పట్టణంలో ఎస్‌వీఎస్ సెక్యూరిటీ ఏజెన్సీ యాజమాన్య ప్రతినిధిగా ఉన్నారు. మంగళవారం వారు ముగ్గురితో పాటు ఆమదాలవలస మండలం తోటాడకు చెందిన నూక శ్రీను కొత్తరోడ్డు సమీపంలోని దాబాకు వెళ్లారు. భోజనాలు ముగించుకుని రాత్రి 2 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై వస్తుండగా కొత్త రోడ్డు జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో రెల్లవీధికి చెందిన రమేష్, జగదీష్, శ్రీను అక్కడిక క్కడే మృతి చెందగా నూకశ్రీను గాయాల పాలయ్యాడు. బాధితుడి 108కి సమాచారం ఇవ్వడంతో, 108 అంబులెన్‌సలో వారిని రిమ్స్‌కు తరలించారు. రమేష్‌కు భార్య లలిత, కుమార్తె జ్ఞానేశ్వరి ఉన్నారు. జగదీష్‌కు భార్య దేవి, కుమారుడు చరణ్ ఉన్నారు.
కుటుంబ సభ్యుల రోదన
ఓరి దేవుడా మా బిడ్డలు ఏం చేశారు.. నీకు దయలేదా.. అప్పుడే వీరికి నూరేళ్లు నిండిపోయాయా.. కొరివిపెట్టాల్సిన వారిని అర్ధంతరంగా తీసుకుపోయావా అంటూ మృతుల తల్లిదండ్రులు గట్టిగా విలపించారు. జగదీష్ మృతదేహాన్ని చూసిన భార్య దేవి కన్నీరుమున్నీరుగా విలపించింది. జీవితాంతం తోడుంటానని బాసచేసి వెళ్లిపోయావా, నాకు, నా బిడ్డకు ఇక దిక్కెవరు.. అంటూ రోదిస్తుంటే పలువురు కంట తడిపెట్టారు. తండ్రి మృతదేహం వద్ద ఏం జరిగిందో తెలియని స్థితిలో ఉన్న మూడేళ్ల కుమారుడు చరణ్‌ను చూసి పలువురు కన్నీరు కార్చారు.
రెల్లవీధిలో విషాదం
పట్టణంలోని రెల్లవీధికి చెందిన ముగ్గురు యువకులు మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ వీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పుడే తెలవారుతుండగా జగదీష్, శ్రీను, రమేష్‌లు మృతి చెందారన్న విషయం తెలియడంతో వీధి ఒక్కసారిగా గొల్లుమంది. ప్రమాదం ఎలా జరిగిందని ఒకరికొకరు ఆరా తీసుకుంటూ రిమ్స్ ఆసుపత్రికి కుటుంబాలు పరుగులు పెట్టాయి. అయితే నమ్మశక్యం కానీ రీతిలో తమ వీధికి చెందిన యువకుల మృతదేహాలు చూసి గొల్లుమన్నారు.
లారీని గుర్తిస్తాం : డీఎస్పీ
ప్రమాదానికి కారణమైన లారీని త్వరలో గుర్తిస్తామని అందుకు కోసం మూడు బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మృతదేహాలను పరిశీలించారు. జాతీయ రహదారిపై లారీలు సరైన మార్గంలో వెళ్లేలా చూస్తామన్నారు. టోల్‌గేట్‌ల వద్దతనిఖీలను చేయిస్తున్నామని చెప్పారు. రాత్రింబగళ్లు దాబాలు తెరవకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
మృత్యువులోనూ వీడని స్నేహం
మృతులు ముగ్గురితో పాటు గాయపడిన శ్రీను స్నేహితులు. చిన్ననాటి స్నేహితులైన వీరు ఏ విషయమైనా అందరూ చర్చించుకుని నిర్ణయించుకునేవారని బంధువులు చెబుతున్నారు. గొడవలు, తగవులు పడిన సందర్భం లేదని చెప్పారు. వివాహమైన తర్వాత ఆర్థికంగా ఎదిగేందుకు ఆలోచించేవారని చెప్పారు. వారి కలలను లారీ కాలరాచిందని ఆవేదన వ్యక్తం చేశారు.