విద్యుత్‌  విషాదం

Three People Die With Current Shock In Guntur - Sakshi

ముగ్గురు బలి, నలుగురికి తీవ్ర గాయాలు

10 మందికి స్వల్ప గాయాలు 

సాక్షి, వెల్దుర్తి: చాలా రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పోలేరమ్మ కనికరించిందని కుంకుమ బండి కట్టారు. ప్రభలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలకరించారు. ఒకరిపై ఒకరు కుంకుమ చల్లుకుంటూ ఆనందంగా ఊరేగింపు నిర్వహిస్తున్నారు. వీరి సంతోషాన్ని విద్యుత్‌ కాటు విషాదంగా మార్చింది. ముగ్గురిని బలి తీసుకుని గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది. మండలంలోని ఉప్పలపాడులో ఆదివారం అర్ధరాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామంలో పోలేరమ్మ జాతర నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కుంకుమ బండిపై విద్యుత్‌ ప్రభను ఊరేగిస్తున్నారు. అర్ధరాత్రి కుంకుమ బండికి 11 కేవీ విద్యుత్‌ వైర్లు తాకటంతో ఒక్కసారిగా ప్రభకు సరఫరా జరిగింది. దీంతో ఇనప బండిని పట్టుకున్న చరకా గాలయ్య (50), కామినేని వెంకటేశ్వర్లు (52), కాకునూరి సత్యనారాయణ (24) విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు.

బండిని పట్టుకున్న మాజీ సర్పంచ్‌ పోలగాని సైదులు, పోతునూరి గోవిందు, బాలబోయిన వీరాంజనేయులు, పలస బ్రహ్మయ్య తీవ్రంగా గాయపడ్డారు. బండి చుట్టూ ఉన్న మరో 10 మందికి స్వల్పగాయాలయ్యాయి. పోలేరమ్మ బండిని పక్కకు జరిపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఒక వైపు ఒరిగి 11 కేవీ విద్యుత్‌ తీగకు తగిలింది. అప్పటి వరకు జనరేటర్‌పై విద్యుత్‌ దీపాలు వెలుగుతుండటం, అకస్మాత్తుగా ప్రభ విద్యుత్‌ తీగలపై ఒరగటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జనరేటర్‌ పెద్ద శబ్దంతో పేలిపోయింది. విద్యుత్‌ ప్రభపై ఉన్న ఐదుగురు కార్మికులు కిందకు దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. చాలా మంది ఊరేగింపునకు చెప్పులు లేకుండానే వచ్చారు.

రోడ్డుపై తడి ఉండటంతో ఎక్కువ మంది కరెంట్‌ షాక్‌కు గురయ్యారు. గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కలగయ్య సంఘటన స్థలానికి చేరుకొని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు, మాచర్ల రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గ్రామమంతా రోదనలే..
మృతి చెందిన కామినేని వెంకటేశ్వర్లు భార్య నారమ్మ, వారి బంధువులు, చరకా గాలయ్య భార్య గురవమ్మ, కాకునూరి సత్యనారాయణ తల్లి అరుణ, తీవ్రంగా గాయపడిన వారి బంధువులు ప్రభుత్వ వైద్యశాలలో కన్నీరుమున్నీరుగా విలపించారు.

నాయకుల పరామర్శ
మాచర్ల: స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న మృతదేహాలకు శుక్రవారం వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top