నేడు మల్లేశ్వరస్వామి కల్యాణ వేడుకలు
● గంగా భ్రమరాంబ సమేత
మల్లేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా
మహాశివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు
● భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల
ఆర్జిత సేవలు నిలుపుదల
పెదకాకాని: పెదకాకానిలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు శనివారం భ్రమరాంబ అమ్మవారిని వనదుర్గాదేవిగా భక్తులు దర్శించుకున్నారు. శివాలయంలో సుప్రభాతసేవ, మహా హారతులతో మొదలై స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు.
● సాయంత్రం స్వామి వారిని ప్రత్యేక పూలతో అలంకరించిన మయూర వాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు.
● సాంస్కతిక కార్యక్రమాలలో భాగంగా ఎస్.నాగమల్లేశ్వరి భాగవతారణి, వినుకొండ వారిచే హరికథ కాలక్షేపం, శ్రీ సత్యకృష్ణ కూచిపూడి కళా నిలయం, కూచిపూడి వారిచే కూచిపూడి నృత్యం, చింతా వెంకట దుర్గాప్రసాద్, విజయవాడ వారిచే మోహినీ భస్మాసుర పూర్తి నాటకం ప్రదర్శించారు.
నేడు మహా శివరాత్రి ప్రత్యేక ఏర్పాట్లు
● మహాశివరాత్రి పర్వదినాన తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించడం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు అర్చక స్వాములచే స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం జరిపి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించుట జరుగుతుందన్నారు.
● స్వామివారి మూలవిరాట్ దర్శనం, అభిషేక మండపంలో నిర్వహించే రూ.100 అభిషేకాలు, రాహు–కేతు పూజలు మినహా అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేసినట్టు తెలిపారు.
● మహాశివరాత్రి ఆదివారం నాడు భ్రమరాంబ అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తారు. రాత్రి 11 గంటలకు స్వామి వారికి రుద్రాభిషేకం జరుగుతుందన్నారు.
● రాత్రి 12 గంటలకు గజవాహనంపై ఎదుర్కోలు ఉత్సవం, తెల్లవారు జామున 2 గంటలకు గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దివ్య కల్యాణం అత్యంత వైభోపేతంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
నేడు మల్లేశ్వరస్వామి కల్యాణ వేడుకలు


