రైతులు ఆధునిక దేవాలయంగా భావించే ప్రకాశం బ్యారేజి భద్రతకు ముప్పువాటిల్లే పరిస్థితులను అధికారులు, నిర్మాణ సంస్థలు కల్పిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, గుంటూరు : రైతులు ఆధునిక దేవాలయంగా భావించే ప్రకాశం బ్యారేజి భద్రతకు ముప్పువాటిల్లే పరిస్థితులను అధికారులు, నిర్మాణ సంస్థలు కల్పిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తున్న ఈ బ్యారేజి పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఎగువ, దిగువ అప్రాన్‌లకు 500 మీటర్లలోపు నదిలో తవ్వకాలు జరపరాదనే నిబంధనలకు విరుద్ధంగా మూడు రోజుల నుంచి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. తమకు అనుమతులు ఉన్నాయని చెబుతూ కొంత మంది బ్యారేజీకి సమీపంలో రాత్రీ పగలు ఇసుక తవ్వుతున్నారు. ఆ ఇసుకను పడవల ద్వారా ఒడ్డుకు చేర్చి, అక్కడి నుంచి రాత్రి వేళల్లో లారీల ద్వారా హ్యాపీ క్లబ్‌కు సమీపంలో నిల్వ చేస్తున్నారు. ఇసుకను తవ్వే సమయంలోనూ, ఒడ్డుకు చేర్చే సమయంలో సాధారణంగా ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు చెందిన సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. అయితే ఈ రెండు శాఖల సిబ్బంది మూడు రోజుల నుంచి అక్కడ కనిపించకపోవడం సందేహాలకు తావిస్తుంది.
రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఒక రహదారిని నిర్మిస్తున్న బడా నిర్మాణ సంస్థకు అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు బాహాటంగా వినపడుతున్నాయి. ఇసుక తవ్వకాల వల్ల బ్యారేజీ పరిరక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందనే భయం రైతులను వెన్నాడుతోంది.
ర్యాంపులకే అనుమతులు లేవు.. ఇసుక లారీల రాకపోకల వల్ల బ్యారేజీ కట్టడానికి నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో ఎగువ అప్రాన్‌కు కిలోమీటరు దూరాన్ని నిషేధిత ప్రాంతంగా ఇరిగేషన్ అధికారులు గత సంవత్సరం మార్చి 9న ప్రకటించారు. అంతేకాక ఉండవల్లి గ్రామంలోని పిడబ్ల్యుడి వర్క్‌షాపుకు సమీపంలో ర్యాంపు వేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. రెండేళ్ల క్రితం ఆ ప్రాంతంలో కొనసాగిన ర్యాంపు వల్ల ఉండవల్లి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. శిథిలావస్థలో ఉన్న వంతెనపై నుంచి లారీల రాకపోకలు కొనసాగడంతో అది ఎప్పుడు కూలిపోతుందోనని భయపడ్డారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఎగువ అప్రాన్‌కు కిలోమీటరు దూరంలో ర్యాంపులకు కూడా అనుమతి ఇవ్వ లేదు.
ర్యాంపు విషయంలోనే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న అధికారులు బ్యారేజీకి అరకిలోమీటరు దూరంలో ఇసుక తవ్వకాలకు, రవాణాకు అనుమతి ఎలా ఇచ్చారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అదే విధంగా వర్క్‌షాపుకు సమీపంలోని బకింగ్‌హామ్ కాలువపై ఏర్పాటు చేసిన వంతెన శిథిలావస్థకు చేరడంతో వాహనాల రాకపోకలను నిలువరించడానికి ఇరిగేషన్ అధికారులు వంతెనకు అడ్డంగా బారికేడ్లు వేశారు. ఇటీవల వాటిని పూర్తిగా తొలగించడంపై సందేహాలు కలుగుతున్నాయి. ఇసుక తవ్వకాల విషయమై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల్లోని ఉన్నతాధికారులను వివరణ కోరగా, ఫైల్ స్టేటస్ తమకు తెలియదని చెప్పారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సాంబశివరావును ఈ విషయమై ప్రశ్నించగా, గతంలో ఇచ్చిన అనుమతులకు పర్మిట్లు ఉన్నాయని, వాటిని ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు.