సూక్ష్మ నీటి పారుదల శాఖ పనితీరుపై కలెక్టర్ బి.శ్రీధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్ నెలలో రూపొందించిన ప్రతిపాదనలను ఇప్పటికీ అమలు చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. పదిహేను రోజుల్లోగా పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలన్నీ గ్రౌండింగ్ చేయాలని స్పష్టం చేశారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సూక్ష్మ నీటి పారుదల శాఖ పనితీరుపై కలెక్టర్ బి.శ్రీధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్ నెలలో రూపొందించిన ప్రతిపాదనలను ఇప్పటికీ అమలు చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. పదిహేను రోజుల్లోగా పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలన్నీ గ్రౌండింగ్ చేయాలని స్పష్టం చేశారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం జిల్లాపరిషత్‌లో సూక్ష్మ నీటి పారుదల ప్రాజెక్టు, డ్వామా, ట్రాన్స్‌కో అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సూక్ష్మ నీటి పారుదల ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ సమీక్షిస్తూ.. గతేడాది బిందుసేద్యం కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన ప్రతిపాదనలను ఇప్పటివరకు గ్రౌండింగ్ చేయకుండా జాప్యం చేయడం అధికారుల నిర్లక్ష్యమేనన్నారు. వెంటనే గ్రౌండింగ్ చేసి వారంరోజుల్లో సవివరమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఇందిర జలప్రభ పురోగతిని సమీక్షిస్తూ.. పథకం కింద ఇప్పటివరకు వేసిన 280 బోర్లలో 73 బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే వాటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా బోరు మోటర్‌తో పాటు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా ఉద్యాన పంటల సాగుకు బిందుసేద్యం పరికరాలను కూడా అందిస్తుందని, ఇవన్నీ సక్రమంగా నిర్వహిస్తేనే పథకం విజయవంతం అవుతుందని అన్నారు. సమావేశంలో డ్వామా పీడీ చంద్రకాంత్‌రెడ్డి, యంఐపీ పీడీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.