ఫలించని చివరి ప్రయత్నం... | The last unsuccessful attempt ... | Sakshi
Sakshi News home page

ఫలించని చివరి ప్రయత్నం...

Sep 28 2015 11:24 PM | Updated on Sep 3 2017 10:08 AM

ఫలించని చివరి ప్రయత్నం...

ఫలించని చివరి ప్రయత్నం...

ఐదు రోజులు... 120 గంటలు... 300మంది జీవీఎంసీ సిబ్బంది... ఐదు నేవీ బోట్లు... రెండు హెలికాప్టర్లు... డేగ కళ్లతో

డ్రైనేజీలను జల్లెడ పట్టిన జీవీఎంసీ
అంతుచిక్కని అదితి ఆచూకీ
నిరాశపరచిన సీసీ కెమెరాల ఫుటేజి

 
ఎంవీపీ కాలనీ: ఐదు రోజులు... 120 గంటలు... 300మంది జీవీఎంసీ సిబ్బంది... ఐదు నేవీ బోట్లు... రెండు హెలికాప్టర్లు... డేగ కళ్లతో అదితి కోసం వెదికినా ఫలితం లేకపోయింది. ఎంత గాలించినా సోమవారం కూడా చిన్నారి జాడ అంతుచిక్కడం లేదు. చివరి ప్రయత్నంగా గెడ్డల మార్గాన్ని జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ జల్లెడ పట్టించారు. ఎంవీపీకాలనీ సెక్టార్-1లోని డ్రైనేజ్ లోపల వంద ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి మూడు మోటార్లతో కాలువలో నీరు తోడించారు. పూర్తిగా డ్రై చేసి 100మంది సిబ్బంది అణువణువూ గాలించారు. జోన్-2 కమిషనర్ నల్లనయ్య మాట్లాడుతూ ఇప్పటి వరకు డ్రైనేజీలను 25సార్లు సిబ్బంది వెతికినప్పటికీ కనిపించలేదని చెప్పారు. నేవీకి చెందిన జెమినీ బోట్లతో సముద్రంలోని 20 కిలోమీటర్ల వరకు వెతికామన్నారు. ఇంకా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఎవరి మీదా అనుమానం లేదు...
అదితిని కిడ్నాప్ చేశారన్న అనుమానాలేవీ లేవని పాప బంధువు శాస్త్రి చెప్పారు. అయితే కాలువలో కొట్టుకుపోతూ ఎవరికైనా దొరికి ఉంటుందన్న ఆశ మాత్రం ఇంకా మిగిలేవుందన్నారు. పాప బతికి ఉంటుందని అనుకుంటున్నాం. పాప బెంగళూరులో జన్మించి రెండు సంవత్సరాలుగా తాత వద్ద పెరుగుతోందని తెలిపారు. గురువారం సాయంత్రం ఏం జరిగిందని ట్యూషన్ టీచర్‌ను పోలీసులు విచారించినట్లు సమాచారం. సంఘటన స్థలానికి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజిని వెదికినా ఏమీ కనిపించకపోవడంతో పోలీసులు నిరాశకు లోనయ్యారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement