చివరి ఆశలు | The last hopes... | Sakshi
Sakshi News home page

చివరి ఆశలు

Dec 19 2013 4:24 AM | Updated on Sep 2 2017 1:45 AM

అధికారుల్లో కొరవడిన ముందు చూపు.. ప్రణాళిక లేని చర్యలు అన్నదాతల పాలిట శాపంగా మారింది.

బిట్రగుంట, న్యూస్‌లైన్ :  అధికారుల్లో కొరవడిన ముందు చూపు.. ప్రణాళిక లేని చర్యలు అన్నదాతల పాలిట శాపంగా మారింది. రబీ సీజన్ ప్రారంభానికి ముందే ఐఏబీ సమావేశం నిర్వహించి నీటి విడుదల ప్రణాళిక రూపొందించినా కాలువలకు నీటి విడుదల చేయడంలో అధికారులు అలవికాని నిర్లక్ష్యం ప్రదర్శించారు. వ్యవసాయానికి సాగునీరందించే ప్రధాన జలాశయంలో పుష్కలంగా నీరుండటంతో సాగునీటికి ఎలాంటి ఢోకా లేదని భావించిన రైతులు
 
 వరినాట్లు వేశారు. రోజులు గడుస్తున్నా.. చెరువులకు, కాలువలకు సాగునీరు విడుదల చేయకపోవడంతో చెరువుల్లోని అరకొర నీటితో పైర్లను కాపాడుకుంటూ వచ్చారు. ప్రస్తుతం చెరువులు అడుగంటిపోవడంతో పైర్లకు నీరు లేక ఎండు ముఖం పట్టాయి. వరి నాటిన పొలాలు బద్దలు బద్దలుగా బీటలు వారాయి. పైర్లను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు అవకాశం ఉన్న ప్రాంతాల్లోని నీటి కుంటలు, కాలువల్లోని కొద్దిపాటి నీటిని మోటార్లు పెట్టి నీటిని పైపుల ద్వారా పైర్లను కాపాడుకుంటుంటే.. మరి కొందరు బిందెలతో నీటిని తెచ్చి పైర్లకు ఊపిరి పోస్తున్నారు.
 
 10 వేల ఎకరాల్లో ఎండు దశలో పైర్లు
 కావలి కాలువ కింద శ్రీవెంకటేశ్వరపాళెం మేజర్ కాలువ ఉంది. ఎస్వీపీఎం కింద దామవరం, చామదల, గౌరవరం మైనర్ కాలువలు ఉన్నాయి. ఎస్వీపీఎం కింద 25 వేల ఎకరాల ఆయకట్టు ఉంటే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, ఐఏబీ నిర్ణయంతో సుమారు 20 వేల ఎకరాల్లోనే వరి పైర్లు సాగు చేశారు. ప్రస్తుతం పైర్లు లేత పొట్టదశలో ఉన్నాయి. అయితే సాగునీటిని విడుదల చేయడంలో సోమశిల అధికారులు జాప్యం చేయడం వల్ల దాదాపు 10 వేల ఎకరాల్లో పైర్లు ఎండు ముఖం పట్టాయి. దామవరం, చామదల, గౌరవరం కాలుల కింద ఆయకట్టు చివరి ప్రాంతాలకు సాగు నీరందకపోవడంతో పైర్లు బతికించుకునేందుకు రైతులు అల్లాడిపోతున్నారు. ఆయిల్ ఇంజన్లు, మోటార్లు వినియోగించి కాలువలు, వాగుల్లోని ప్రతి చుక్కను పొలానికి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నా.. ఫలితం ఉండటం లేదు.  
 
 సోమశిల నీటి విడుదలలో మరింత జాప్యం
 సంగం బ్యారేజీ నుంచి కావలి కాలువకు సాగునీటిని అధికారికంగా విడుదల చేసినా.. పూర్తిస్థాయిలో నీరందని పరిస్థితి నెలకొంది.  కావలి కాలువ హైలెవల్‌లో ఉండటం వల్లే ఈ దుస్థితి. కావలి కాలువలో పూర్తిస్థాయిలో నీటి మట్టం పెరగాలంటే బ్యారేజీ వద్ద ఇసుక బస్తాలు వేసి అక్కడ నీటి మట్టం పెంచడం వల్లే సాధ్యమవుతుంది. ఈ పనిని చేపట్టడంలో సోమశిల అధికారులు దాదాపు రెండు నెలలుగా జాప్యం చేశారు. ఎట్టకేలకు ఈనెల 9వ తేదీ నుంచి సంగం బ్యారేజీ వద్ద ఇసుక బస్తాలు వేసే చర్యలు చేపట్టారు. ఈనెల 15వ తేదీలోగా పనులు పూర్తి చేసి నీటి మట్టం పెంచి కావలి కాలువకు నీటి విడుదల సామర్థ్యాన్ని పెంచుతామనిసోమశిల అధికారులు ప్రకటించారు. కావలి కాలువ కింద ఆయకట్టు ఎండిపోతున్న పరిస్థితుల్లో కావలి ఆర్డీఓ సైతం ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈనెల 18వ తేదీన కావలి కాలువకు నీటిని విడుదల చేస్తారని ఆర్డీఓ సైతం ప్రకటించారు. అయితే సంగం బ్యారేజీ వద్ద ఇంకా ఇసుక బస్తాలు వేసే పనులు పూర్తి కాలేదు. ఇంకా రెండు..మూడు రోజులు పట్టే అవకాశం ఉందని సంబంధితశాఖాధికారులు చెబుతున్నారు.
 
 ఈ పనులు పూర్తయితే.. బ్యారేజీ వద్ద నీటి మట్టం పెంచి ఆ తర్వాత కానీ కావలి కాలువకు నీటి విడుదల సామర్థ్యాన్ని పెంచే అవకాశం లేదు. అక్కడ నుంచి కావలి కాలువలో పూర్తిస్థాయిలో నీటి మట్టం పెరిగితే శ్రీవెంకటేశ్వరపాళెంకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం కావలి కాలువ కింద సుమారు 80 ఎకరాల్లో వరి సాగులో ఉంది. అన్ని పొలాలకు తక్షణం నీటి ఆవశ్యకత ఉంది. అన్ని ప్రాంతాల రైతులు సాగనీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఏ ప్రాంతానికి తొలుత నీటిని అందించినా మిగతా ప్రాంతాల్లో పైర్లు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వేలాది ఎకరాలు బీటలు వారాయి.  అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు ఆవేదనతో అల్లాడి పోతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ చొరవ తీసుకుని యుద్ధప్రాతిపదికన సాగునీటిని అందించి అన్నదాతలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement