రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల వెలుగుచూసిన పలు అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ఎవరి భాగస్వామ్యం ఎంత ఉందన్న విషయం బయటకు వస్తుందని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.రాజయ్యను బర్తరఫ్ చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో, ఈ అంశంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు సరైన సమాధానం ఇవ్వాలని, ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నవాళ్ల నోళ్లు మూయించాలని భావిస్తున్న ప్రభుత్వ పెద్దలు విచారణకు ఓ కమిటీని వేసి దాని బాధ్యతలను ఓ సీనియర్ ఐఏఎస్‌కు అప్పగించాలని యోచిస్తోంది.
రాజయ్య ఏం తప్పు చేశారో చెప్పకుండా ఏకపక్షంగా ఎలా బర్తరఫ్ చేస్తారన్న టీడీపీ, కాంగ్రెస్ నేతల విమర్శల నేపథ్యంలో విచారణ కమిటీ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. పదవి నుంచి ఉద్వాసనకు గురైన రాజయ్య సైతం తనను తొలగించిన మొదటిరోజు రాత్రే మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని, తప్పు తేలితే ఏ శిక్షకైనా వెనుకాడనని ప్రకటించారు.
మంగళవారం గుండెనొప్పితో అస్వస్థతకు గురైన రాజయ్య, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక కూడా విలేకరుల వద్ద ఇదే అంశాన్ని మళ్లీ ప్రకటించారు. ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా ఎంత నిక్కచ్చిగా ఉం దో తేల్చి చెప్పాలన్న వ్యూహంలో భాగంగానే కమిటీ ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు.