పాలసేకరణకు మంగళం | The government's aim to develop the formers benfits | Sakshi
Sakshi News home page

పాలసేకరణకు మంగళం

Nov 29 2013 3:45 AM | Updated on Oct 20 2018 6:17 PM

పాడిపరిశ్రమను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పాల సేకరణ ప్రక్రియకు ఆదిలోనే నిర్లక్ష్యపు చెద పట్టింది.

నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: పాడిపరిశ్రమను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పాల సేకరణ ప్రక్రియకు ఆదిలోనే నిర్లక్ష్యపు చెద పట్టింది. ఎంతో ఉన్నతాశయంతో కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన యంత్రాలు శిథిలమైపోతున్నాయి. అధికారుల పర్యవేక్షణా లోపం, క్షేత్రస్థాయిలో కొందరి కాసుల కక్కుర్తి కారణంగా వీటికి గ్రహణం పట్టింది.
 
 జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు మండల సమాఖ్యల ఆధ్వర్యంలో 2008లో పాలశీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు రూ.3 కోట్లు వెచ్చించి యంత్రాలు అందుబాటులోకి తెచ్చారు. వీటి నిర్వహణ బాధ్యతలను డీఆర్‌డీఏ ఆధ్వర్యంలోని మండల సమాఖ్యలకు అప్పగించారు.
 
 ఈ సమాఖ్యల ఆధ్వర్యంలో గ్రామాల్లో పాలమిత్రలు పాలు సేకరించారు. పాల శీతలీకరణకు వెంకటాచలం, పొదలకూరు, డక్కిలిలో ఏపీ డెయిరీ నిధులు రూ.3 కోట్లతో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వీటిలో అధునాతన యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. పాలసేకరణ కేంద్రాలకు క్యాన్లు, మిల్క్ టెస్ట్ మిషన్లు సమకూర్చారు. పాలల్లో వెన్నశాతాన్ని తెలుసుకునేందుకు ఒక్కో మిషన్‌ను రూ.45 వేలతో కొనుగోలు చేశారు. కొద్దిరోజుల పాటు పాలసేకరణ విజయవంతంగా సాగింది.
 
 ప్రైవేటు డెయిరీలు లీటర్ పాలను రూ.16కి కొనుగోలు చేస్తున్న సమయంలో డీ ఆర్‌డీఏ ఆధ్వర్యంలోని డెయిరీలు రూ.18 వంతున చెల్లించడంతో రైతుల నుంచి విశేష స్పందన లభించింది. పాలమిత్రలు  ప్రైవేటు డెయిరీలకు దీటుగా పాలను సేకరించారు. క్రమేణా అధికారుల పర్యవేక్షణ తగ్గడం, క్షేత్రస్థాయిలో కొందరు కాసులకు కక్కుర్తి పడటంతో పథకం అమలు లక్ష్యం పక్కదారి పట్టింది. రైతుల నుంచి రెండు వేల లీటర్ల పాలు సేకరిస్తే, వాటిలో 40 శాతం పాలను ప్రైవేటు డెయిరీలకు ఎక్కువ ధరకు విక్రయించసాగారు. మిగిలిన పాలలో నీళ్లు కలిపి విజయా డెయిరీకి తరలించేవారు. అక్కడ వెన్న శాతాన్ని పరిశీలించి రైతులకు తక్కువ ధర చెల్లించేవారు. క్రమేణా పాల రాబడి తగ్గిపోవడంతో రైతులు ప్రైవేటు డెయిరీల వైపు మొగ్గుచూపారు. పాలసేకరణ లేకపోవడంతో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలోని డెయిరీలు ఏడాదిలోపే మూతపడ్డాయి. శీతలీకరణ కేంద్రాల్లోని కోట్లాది రూపాయల విలువైన పరికరాలు శిథిలమవడం ప్రారంభించాయి. 2010లో అప్పటి కలెక్టర్ రాంగోపాల్ దృష్టికి ఈ సమస్య వెల్లింది.
 
 ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించి డెయిరీల పునఃప్రారంభానికి చర్యలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మార్పు రాకపోవడంతో మళ్లీ ఆరు నెలలకే డెయిరీలు మూతపడటంతో శీతలీకరణ కేంద్రాల పరిస్థితి మొదటికొచ్చింది. మరోవైపు రైతులకు బకాయిల చెల్లింపు నిలిచిపోయింది. పొదలకూరు పాలశీతలీకరణ కేంద్రం పరిధిలో ఇప్పటికి రూ.2.35 లక్షలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం పాల వ్యాపారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో డీఆర్‌డీఏ పాల కేంద్రాలపై దృష్టిపెడితే మంచి ఫలితాలు ఉంటాయని రైతులు చెబుతున్నారు. అదే సమయంలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement