అధికారం మత్తుతో అహంకారం తలకెక్కినప్పుడు మానవ హక్కుల ఉనికికే ముప్పు ఏర్పడుతుంది. సమాజంలో భయానక పరిస్థితులు నెలకొంటాయి.
► చంద్రబాబు నిరంకుశ వైఖరిపై ప్రజాస్వామికవాదుల మండిపాటు
► గొంతెత్తేవారి పీకనొక్కుతున్నారంటూ ఆందోళన
► పద్ధతి మార్చుకోకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్ : అధికారం మత్తుతో అహంకారం తలకెక్కినప్పుడు మానవ హక్కుల ఉనికికే ముప్పు ఏర్పడుతుంది. సమాజంలో భయానక పరిస్థితులు నెలకొంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సరిగ్గా అవే పరిస్థితులు నెలకొన్నాయి. పాలకవర్గం అసహనంతో, వివక్షతో, కక్షతో విద్వేష పూరితంగా వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగిస్తోంది. గొంతెత్తిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతోంది. ఇందుకు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల కార్యకర్తలు, కూలీలు, రైతులు, విద్యార్థులు, మహిళలు.. ఇలా సమాజంలోని ఏ వర్గమూ మినహాయింపు కాకపోవడం గమనార్హం.
చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం గత 18 నెలలుగా తన నిరంకుశ వైఖరిని కొనసాగిస్తోంది. ముఖ్యంగా విపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలను లక్ష్యంగా చేసుకుని ఉక్కుపాదం మోపుతోంది. ఇక, వామపక్ష కార్యకర్తలు, నాయకులపై కేసులకు లెక్కేలేదు. సీపీఐ కార్యకర్తలపై 10 జిల్లాల్లో, సీపీఎం కార్యకర్తలపై 11 జిల్లాల్లో కేసులు నమోదు చేయించింది.
ఇక తమకిచ్చిన హామీల అమలు కోసం ఉద్యమించిన అంగన్‌వాడీలపై ప్రభుత్వ ఆదేశాలతో లాఠీలు కరాళనృత్యం చేశాయి. విదేశీ యూనివర్శిటీలు వద్దన్నందుకు విద్యార్థుల వీపు విమానం మోత మోగింది. రాజధాని కోసం బలవంతంగా భూములు తీసుకోవడం అన్యాయమన్న వారి పంటల్ని తగులబెట్టారు. చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ పోకడను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని, సమష్టిగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజాస్వామికవాదులు అంటున్నారు.
జైళ్లను జనంతో నింపుతారా?
అన్యాయాన్ని ఎదిరించిన ప్రతి ఒక్కర్నీ జైళ్లలో పెడుతూ ఈ సమాజాన్ని చంద్రబాబు ఎక్కడికి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. అయినదానికీ కానిదానికీ పోలీసు బలాన్ని ప్రయోగిస్తే పౌరహక్కులు ఏం కావాలి? హక్కులు కావాలన్నందుకు వామపక్షాల నేతలను జైల్లో పెట్టారు. రాజధానికి భూములు ఇవ్వబోమన్నందుకు విచారణ పేరిట రైతుల్ని పోలీసుస్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఆయన పద్ధతి మార్చుకోకపోతే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదు.
- కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
బాబు నియంతలా వ్యవహరిస్తున్నారు
చంద్రబాబు అసలు స్వరూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఆయనో నియంతలా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మొదలు అంగన్‌వాడీల అరెస్ట్ వరకు... చంద్రబాబుది ఒకటే దారి. ప్రశ్నించేవారి పీకనొక్కి లొంగదీసుకోవడమే ఆయన అభిమతం. అంగన్‌వాడీలతో పెట్టుకున్నందుకు గతంలో ఏమైందో మరిచిపోయినట్టున్నాడు. చంద్రబాబు ధోరణిని నిరసించకపోతే పౌర హక్కులకే ప్రమాదం. - పి. మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
ప్రభుత్వంలో ఉన్నవారికి నియంతృత్వం తగదు
ప్రభుత్వంలో ఉన్న వారు నియంతృత్వ వైఖరితో వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నవారు అంతా తాము అనుకున్నట్టే జరిగిపోవాలన్న భావనతో ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ప్రతి ఒక్కరి విషయంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ప్రభుత్వ తప్పులు ఎవరైనా ఎత్తిచూపినప్పుడు, ప్రజలు, ఉద్యోగులు తమ సమస్యలను ప్రస్తావిస్తున్న సందర్భాలలో.. సర్కార్ పెద్దలు అవలంబిస్తున్న వైఖరి అభ్యంతరకరంగా ఉంది. తప్పులు ఎత్తిచూపినప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు వాటిని సద్విమర్శలుగా తీసుకుని సరిచేసుకోవాలి తప్ప అదే నేరమన్నట్టుగా వ్యవహరించడం వల్ల ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం, ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి కట్టుబడినప్పుడే ప్రజలకు మేలు కలుగుతుంది. - ఎస్.సురేష్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి