వయసు 11.. మెడల్స్‌ 11

Thanuku Kid Talent In Martial Arts West Godavari - Sakshi

మార్షల్‌ ఆర్ట్స్‌లో సత్తా చాటుతున్న రాకేష్‌

పిల్లాడు కాదు పిడుగు

పశ్చిమగోదావరి, తణుకు అర్బన్‌: మార్షల్‌ ఆర్ట్స్‌లో సత్తా చాటుతున్నాడు తణుకు మండలం మండపాకకు చెందిన బుడతడు పురాల్‌ రాకేష్‌. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు నిదర్శనంగా 5వ తరగతి చదువుతున్న రాకేష్‌ 11 ఏళ్ల వయస్సులో జాతీయ, రాష్ట్రస్థాయిలో 11 మెడల్స్‌ సొంతం చేసుకుని శభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఈ మెడల్స్‌లో 10 గోల్డ్, 1 సిల్వర్‌ మెడల్‌ ఉండటం విశేషం. వయసుకు, ఎత్తుకు సంబంధం లేకుండా కుంగ్‌ ఫు ఫైట్స్‌లో ప్రత్యర్థిని చిత్తు చేస్తున్నాడు. వెళ్లిన ప్రతి పోటీలోనూ మెడల్‌ సాధిస్తూ క్రీడాభిమానం ఉన్న వారందరి చూపూ తనవైపు తిప్పుకుంటున్నాడు. తల్లిదండ్రులు కూడా కరాటేలో ప్రావీణ్యం ఉండడంతో వారి ప్రోత్సాహంతో మార్షల్‌ ఆర్ట్స్‌లోని పెన్‌కాక్‌ సిలాట్, కుంగ్‌ ఫూ, కరాటే, సెల్ఫ్‌ డిఫెన్స్, కిక్‌ బాక్సింగ్, థాయ్‌ బాక్సింగ్, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అంశాల్లో శిక్షణ పొందుతున్నాడు. మండపాక చదలవాడ ఇంగ్లిషు మీడియం స్కూలులో చదువుతున్న రాకేష్‌ ఇటు చదువులోనూ మొదటి ర్యాంకులో నిలుస్తున్నాడు.

గురువు సత్య శిక్షణలో..
తణుకు శ్రీ రామకృష్ణ సేవా సమితి భవనంలో సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ షావొలిన్‌ కుంగ్‌ ఫు డ్రంకెన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కుంగ్‌ ఫు–డు మాస్టర్‌ డీడీ సత్య శిక్షణలో గత ఏడాదిన్నరగా రాకేష్‌ రాటుదేలుతున్నాడు. రాకేష్‌ తండ్రి పురాల్‌ వెంకటేష్‌ మండపాకలో చిన్న టిఫిన్‌ హోటల్‌ నిర్వహిస్తుండగా తల్లి కనకదుర్గ కూడా భర్తకు సహాయంగా ఉంటారు. చెల్లి జ్యోతి 4వ తరగతి చదువుతోంది.

ప్రోత్సాహం కరువు
మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే ఎంతో ఖరీదైన క్రీడ. శిక్షణతో పాటు ఏ టోర్నమెంట్‌కు వెళ్లాలన్నా వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చినట్టు రాకేష్‌ తండ్రి వెంకటేష్‌ చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top