
తనపై షూ విసిరిన లాయర్(సస్పెండెడ్) రాకేష్ కిషోర్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ క్షమించినా.. న్యాయ వ్యవస్థ మాత్రం వదిలిపెట్టడం లేదు. ఆయనపై కోర్టు ధిక్కరణ కింద క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలని తాజాగా అటార్నీ జనరల్ అనుమతిచ్చారు. అయితే.. ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తే మంచిదంటూ సుప్రీం కోర్టు గురువారం అభిప్రాయపడింది.
అటార్నీ జనరల్ ఈ చర్యకు చట్టపరమైన అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తే దానంతట అదే ఆగిపోతుంది. లేకుంటే.. సోషల్ మీడియాలో చర్చలతో సాగుతుంటుంది. పైగా ఈ అంశాన్ని పదే పదే చర్చించడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది అని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి అభిప్రాయపడ్డారు.
అక్టోబర్ 6వ తేదీన కేసు లిస్టింగ్‌లు జరుగుతున్న టైంలో.. అడ్వొకేట్ రాకేష్ కిషోర్ తన షూను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మీదకు విసిరారు. అయితే అది ఆయన దాకా వెళ్లకుండా కింద పడిపోయింది. దీంతో అప్రమత్తమైన తోటి లాయర్లు కిషోర్‌ను అడ్డగించి.. కోర్టు సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఆ సమయంలో సనాతన ధర్మాన్ని అవమానిస్తే దేశం ఊరుకోదు అంటూ కిషోర్ నినాదాలు చేశాడు. అయితే ఈ ఘటనను పట్టించుకోకుండా ప్రొసీడింగ్స్ కొనసాగించాలని జస్టిస్ గవాయ్ అక్కడున్నవాళ్లకు సూచించారు. ఇలాంటివి తనని ప్రభావితం చేయబోవని ఆ టైంలో అన్నారాయన.
అటుపై చీఫ్ జస్టిస్ సూచనతో ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు కాకుండా సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ చూసుకుంది. దీంతో రాకేష్‌ను మూడు గంటలపాటు ప్రశ్నించి.. షూ, ఆయన ఫైల్స్‌ను అందించి ఢిల్లీ పోలీసులు వదిలేశారు. ఈలోపు.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయన లాయర్ లైసెన్స్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అయితే తాను చేసిన పనికి పశ్చాత్తపం చెందడం లేదంటూ కిషోర్ పలు ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానించాడు. ఆ వెంటనే సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్.. ఆయన్ని సుప్రీం కోర్టు ఆవరణలోకి అడుగుపెట్టనివ్వకుండా నిషేధం విధించింది.
అయితే.. ఏజీ ఆదేశాల నేపథ్యంలో రాకేష్ కిషోర్‌పై క్రిమినల్ కంటెప్ట్ ఆఫ్ కోర్టుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ అధ్యక్షుడు.. సీనియర్ లాయర్ వికాస్ సింగ్ ఇవాళ ద్విసభ్య ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇది రాజ్యాంగ వ్యవస్థను అవమానించే ఘటన అని, తీవ్రంగా పరిగణించి ఈ అంశాన్ని రేపు విచారణ జరపాలని బెంచ్‌ను కోరారు. అయితే..
ఈ అంశం సోషల్ మీడియాలో కొనసాగుతోందని వికాస్ సింగ్ అనగా.. కొంతమంది ఈ చర్యను సమర్థించారని, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ గౌరవాన్ని దెబ్బ తీసే అంశమని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్ వద్ద అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుని.. ఈ ఘటనలో సీజేఐ చాలా ఉదారంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు సంస్థను ప్రభావితం చేయవని హుందాగా అన్నారు.
అయితే.. ఆయన స్పందన గౌరవప్రదంగానే ఉన్నా సోషల్ మీడియాలో ఈ చర్యను సమర్థించడం ఆందోళన కలిగిస్తోందని తుషార్ మెహతా చెప్పారు. ఈ వ్యవహారంలో John Doe injunction(కోర్టు నుంచి ముందస్తుగా తీసుకునే నిషేధ ఉత్తర్వు) జారీ చేయాలని లాయర్ వికాస్ సింగ్ కోర్టును కోరారు. ఆ సమయంలో జస్టిస్ బాగ్చీ కలుగజేసుకుని.. ‘‘ఇది కొత్త వివాదాలకు దారితీయవచ్చు. కోర్టులో మన ప్రవర్తనే ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తుంది. ఓ బాధ్యతలేని పౌరుడి చర్యగా పరిగణించి సీజేఐ దీనిని పట్టించుకోలేదు. అలాంటి అంశాన్ని మళ్లీ తవ్వడం అవసరమా? అని అన్నారు.
పైగా ఎన్నో ముఖ్యమైన అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, దీనిని పైకి తేవడం సమయాన్ని వృధా చేయడమేనన్న అభిప్రాయమూ ఆయన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని మరింత పెద్దది చేయడం తన ఉద్దేశం కాదని, ఇక్కడితో నిలువరించమే తన అభిమతమని వికాస్ సింగ్ స్పష్టత ఇచ్చారు. ఆపై జస్టిస్ కాంత్ మాట్లాడుతూ.. నా సహ న్యాయమూర్తి చెబుతోంది మీరు కూడా అర్థం చేసుకున్నారు. మీరు ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించిన వెంటనే, మీడియాలో కథనాలు కొనసాగుతాయి అని అన్నారు. ఆ టైంలో..
‘దురదృష్టవశాత్తు, మనం డబ్బు సంపాదించే వ్యాపారాలుగా మారిపోయాం…" అని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో సాలిసిటర్ జనరల్ ఏకీభవించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు అల్గోరిథమ్స్ ఆధారంగా పనిచేస్తాయి. ప్రజలు వాటికి బానిసలుగా మారిపోయారు. ఆ బానిసత్వాన్ని ఈ ప్లాట్‌ఫారాలు డబ్బుగా మార్చుకుంటున్నాయి. మనం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నామనుకుంటాం, కానీ నిజానికి మనమే ఆ ప్లాట్‌ఫారాల ఉత్పత్తులం’’ అని మెహతా అన్నారు. ఆ సమయంలో జస్టిస్ కాంత్ కలుగజేసుకుని మనం ఉత్పత్తులమే కాదు.. వినియోగదారులం కూడా అని అన్నారు.
సోషల్ మీడియా మనుషుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దాని అల్గోరిథమ్స్ ద్వారానే.. ద్వేషం, కోపం, కామం లాంటి భావనలకు గురవుతున్నాం. సోషల్ మీడియా మన ఈ వ్యసనాన్ని మానిటైజ్ చేస్తోంది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అది మళ్లీ మానిటైజ్ అవుతుంది. కాబట్టి దీనిని సహజంగా ముగియనివ్వడమే మంచిది అని జస్టిస్ కాంత్ అన్నారు.
పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని.. అలాగే న్యాయస్థానం కూడా బార్ (న్యాయవాదుల సంఘం) ఆవేదనను అర్థం చేసుకోవాలని లాయర్ వికాస్ సింగ్ కోరారు. ‘‘బార్ (న్యాయవాదుల సంఘం) ఎప్పుడూ న్యాయ వ్యవస్థకు అండగా నిలిచింది. మీరు న్యాయాన్ని కోరే ప్రజలతో కోర్టును కలిపే వంతెన. మీ పరిస్థితిని, మీ భావోద్వేగాలను మేము అర్థం చేసుకుంటున్నాం’’ అని జస్టిస్ కాంత్ అన్నారు.
ఈ అంశాన్ని శుక్రవారం విచారణకు తీసుకురావాలని వికాస్ సింగ్ మరోసారి కోరారు. అయితే.. దీపావళి తర్వాతే విచారించే అవకాశం ఉందని బెంచ్ స్పష్టం చేసింది. ఒక వారం తర్వాత ఇది ఇంకా 'సేలబుల్' అంశంగా ఉంటుందేమో చూద్దాం అని జస్టిస్ కాంత్ సున్నితంగా వ్యాఖ్యానించారు. ఈలోపు.. అల్గోరిథమ్ కోసం కొత్త అంశం వస్తుందేమో చూడాలి అని జస్టిస్ బాగ్చీ అన్నారు. దీనికి సాలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. ఇలాంటి అంశాలకు 24–48 గంటల లైఫ్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి వస్తుంది అనడంతో నవ్వులతో విచారణ వాయిదా పడింది.