ప్రణాళిక ఫలించేనా?

Tenth Class Students Attending Special Classes in Kurnool - Sakshi

మరో 79రోజుల్లోపది పబ్లిక్‌ పరీక్షలు

తూతూ మంత్రంగా ప్రత్యేక తరగతులు

పాఠ్యపుస్తకాల కొరతతో ఇబ్బందులు

కర్నూలు సిటీ/ఆదోని అర్బన్‌: విద్యార్థులకు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు కీలకమైనవి. వీటిని గట్టెక్కేందుకు తీవ్రస్థాయిలో కష్టపడతారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులపై కూడా ఒత్తిడి ఉంటుంది. విద్యాశాఖ కూడా ఇందుకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాల్సి ఉంది. అయితే విద్యాశాఖ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈ విద్యా సంవత్సరం ఆశించిన మేరకు ఫలితం వస్తుందా..లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ, ఏపీ ఆదర్శ స్కూల్స్, కస్తూర్బా స్కూళ్లతో పాటు రెసిడెన్షియల్‌ స్కూళ్లకు చెందిన విద్యార్థులు 34,576 మంది, ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు చెందిన 17,885 మంది... మొత్తంగా 52,461 మంది విద్యార్థులు 2019 మార్చి 18 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాయనున్నారు. ఇందుకు మరో 79రోజులు మాత్రమే గడువు ఉంది. పది ఫలితాల్లో గత ఏడాది జిల్లా 96.12 శాతం ఉత్తీర్ణత సాధించి.. రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. దీంతో ఈ ఏడాది ఈ ప్రాంతంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

ఇవీ అడ్డంకులు..
ఇప్పటికే బోధన ప్రక్రియను పూర్తి చేసి ప్రత్యేక తరగతుల ద్వారా పరీక్షలకు సన్నద్ధం చేయాల్సి ఉంది. అయితే పాఠ్యాంశాల బోధనే నత్తనడకన సాగుతోంది.
భాషోపాధ్యాయులు డిమాండ్ల పరిష్కారం కోసం 20 రోజులు సమ్మెబాట పట్టారు. దీంతో విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల బోధన కరువైంది.
కొన్ని పాఠశాలల్లో  ప్రధాన సబ్జెక్టులకు కూడా ఉపాధ్యాయులు లేరు. దీనికి తోడు ప్రత్యేక తరగతుల శిక్షణ కానరావడం లేదు.
ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం చాలీచాలని పుస్తకాలు అందించింది.  పదో తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఒకరికి ఇస్తే ఇంకొరికి ఇవ్వలేదు. చాలా చోట్ల పూర్తిస్థాయిలో పుస్తకాలు పంపిణీ చేయలేదు.
వెనకబడిన విద్యార్థులకు పది పరీక్షలో మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు ప్రభుత్వం కరదీపికలకు ఇస్తోంది. అయితే ప్రతి పాఠశాలకు ఒక పుస్తకాన్ని అందస్తోంది. ప్రతి విద్యార్థికి అందజేస్తే ఉపయుక్తంగా ఉంటుంది.
జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఈ ఏడాది వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

కొన్ని పాఠ్య పుస్తకాలు లేవు  
కొన్ని పాఠ్యపుస్తకాలు లేనందున చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాను. కరదీపిక పుస్తకాలు కూడా ఇవ్వలేదు. పాఠశాలకు ఒకటే ఇచ్చారు. ఎలా చదువుకోవాలి. పరీక్షలు దగ్గరకు వచ్చాయి. ఒత్తిడి పెరుగుతోంది.  –రుచిత, పదో తరగతి విద్యార్థిని  

ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదు  
పదో తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించి మెరుగైన బోధన ఇవ్వడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ప్రజాప్రతినిధులు కూడా రానున్న ఎన్నికలపైనే ప్రధాన దృష్టి సారిస్తున్నారే కాని విద్యార్థుల చదువుపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి తోడు విద్యాశాఖ కూడా ముందస్తు ప్రణాళికతో విద్యార్థులను సన్నద్ధం చేయడంలో పూర్తిగా వెనకబడింది.–నాగరాజు, ఏబీవీపీ నాయకుడు

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి  
పదో తరగతిలో ఈ ఏడాది 100 శాతం ఫలితాలు సాధించడంకోసం 90 రోజుల ప్రత్యేక ప్రణాళికను తయారు చేశాం. ప్రతి సబ్జెక్టులో కూడా విద్యార్థులకు సులువైన విధానంలో భోధన చేసేందుకు టీచర్లకు శిక్షణ ఇచ్చాం. ముందుగా ఈ ఏడాది స్టడీ మెటిరియల్‌ను విద్యార్థులకు అందజేశాం.  కరువుతో వలస వెళ్లిన వారికి   ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసి చదువు చెప్పిస్తున్నాం. వచ్చే నెల 2వ తేదీ నుంచి రివిజన్‌ టెస్ట్‌లు మొదలు కానున్నాయి.–తాహెరా సుల్తానా, డీఈఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top