
ఖరగ్‌పూర్ ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
మరో విద్యా కుసుమం రాలిపోయింది. ఉన్నత విద్యనభ్యసించడానికి రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లిన తెలుగు విద్యార్థి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
భువనగిరి, న్యూస్‌లైన్: నేత కార్మికుడి కొడుకైనా పట్టుదలతో చదివి ప్రతిష్టాత్మక ఖరగ్‌పూర్ ఐఐటీలో సీటు సంపాదించాడు. బీటెక్ కోర్సు అయిపోయే దశలో ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులకు అంతులేని శోకాన్ని మిగిల్చి వెళ్లాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్ ఐఐటీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న నల్లగొండ జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన బోగ శ్రవణ్‌కుమార్(22) కళాశాల హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఐఐటీ యాజమాన్యం శ్రవణ్ తల్లిదండ్రులకు తెలియజేయడంతోపాటు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రెండు విమాన టికెట్లు కూడా పంపించింది. ఇటీవల క్యాంపస్ సెలక్షన్స్‌లో ఎంపిక కాకపోవడం వల్లే శ్రవణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. శ్రవణ్ 10వ తరగతి వరకు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు.