తెలుగుదేశం పార్టీ రాష్ట్రనేత, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు సొంత నియోజకవర్గంలో అసమ్మతి తలనొప్పిగా మారింది.
కోడెలను వీడని అసమ్మతి సెగ!
Jan 19 2014 1:38 AM | Updated on Sep 2 2017 2:45 AM
సాక్షి, నరసరావుపేట :తెలుగుదేశం పార్టీ రాష్ట్రనేత, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు సొంత నియోజకవర్గంలో అసమ్మతి తలనొప్పిగా మారింది. గత ఎన్నికల్లో కోడెలతో కలిసి పనిచేసిన కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డి రవీంద్ర, వల్లెపు నాగేశ్వరరావు, పత్తిపాటి పుల్లయ్య వంటి నేతలంతా మూడేళ్లుగా వ్యతిరేక వర్గంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్‌టీ రామారావు వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలో డాక్టర్ కోడెల నిర్వహించిన కార్యక్రమాలకు హాజరుకాకుండా, విడిగా నిర్వహించి తమ అసమ్మతి సెగ తీవ్రతను మరోసారి చాటారు. మరోసారి మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండగా ఇప్పటికీ అసమ్మతి నాయకులు.. కోడెలకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా మద్దతిస్తామంటూ బహిరంగంగా వెల్లడిస్తున్నారు. కోడెల వ్యతిరేక వర్గీయులు జరి పిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ నల్లపాటి చంద్రశేఖరరావు తనయుడు రామచంద్రప్రసాద్ (రాము) పాల్గొనడం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో కోడెలకు సీటుదక్కకుండా చేసేందుకు పావులు కదుపుతున్న ట్లు అర్ధమవుతుంది.
జిల్లాలోని కోడెల వ్యతిరేకవర్గ నేతలే ఇక్కడి అసమ్మతి నాయకులకు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది నెలల క్రితం కోడెల తన వ్యతిరేకవర్గానికి చెందిన కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డి రవీంద్ర, వల్లెపు నాగేశ్వరరావులను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వస్తున్నా మీకోసం యాత్ర నిర్వహిస్తూ గుంటూరు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వద్ద అసమ్మతి నేతలు పంచాయితీ పెట్టడంతో అధినేత సైతం వారికి బాసటగా నిలవడం గమనార్హం! ఇటీవల కోడెల నరసరావుపేట నుంచి కాకుండా సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తారంటూ టీడీపీ ముఖ్యనేతలు పనిగట్టుకొని ప్రచారాలు చేయడంతో దీనిని నేరుగా ఖండించని కోడెల ఆత్మీయ పాదయాత్ర పేరుతో నరసరావుపేట నుం చే పోటీ చేస్తున్నాననే సంకేతాన్ని జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో పడ్డారు. పాదయాత్రలోనూ అనేక మంది అసమ్మతి నాయకులు, వ్యక్తిగత కారణాలతో పార్టీకి దూరమైన నేతల ఇళ్లకు వెళ్లినా ప్రయోజనం లేకుండాపోతోంది.
Advertisement
Advertisement