రాష్ట్ర విభజన అంశం పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు నుంచి క్రమంగా రాయల తెలంగాణ దిశగా శరవేగంగా కదులుతుండటం.. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల్లో కలవరం రేపుతోంది.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశం పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు నుంచి క్రమంగా రాయల తెలంగాణ దిశగా శరవేగంగా కదులుతుండటం.. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల్లో కలవరం రేపుతోంది. రాయల తెలంగాణకు ఇప్పటికే పార్టీ అధిష్టానం నుంచి రాజకీయ ఆమోదం లభించిందన్న వార్తలు వారిని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పక్కదారి పట్టిస్తే.. తెలంగాణలో పార్టీని కూడా ప్రజలు పక్కన పెట్టేస్తారని ఆందోళనలో ఉన్న టీ-కాంగ్రెస్ నేతలు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రాయల తెలంగాణ ప్రతిపాదనతో విభేదిస్తూ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపగా.. సోమవారం పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌లు సైతం తమవంతుగా అధిష్టానంతో చర్చలు జరిపారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను పక్కనపెట్టాలని జైపాల్ ఏకంగా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సహా ఇతర ముఖ్య నేతలను కోరగా.. డీఎస్ జీవోఎం సభ్యుడు ఎ.కె.ఆంటోనీని కలిసి ఇదే అంశమై చర్చించారు. పార్టీ నిర్ణయంపై యూ-టర్న్ తీసుకుంటూ రాయల తెలంగాణకు ఆమోదం తెలిపితే రాజకీయంగా టీఆర్‌ఎస్‌కు కొత్త ఆయుధాన్ని ఇచ్చినట్లవుతుందని వారు పెద్దలకు తేల్చిచెప్పినట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్‌కు తెలంగాణలో గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.
రాయల ముసుగు ఎందుకన్న జైపాల్!
రాజకీయ లబ్ధి, నదీ జలాల వివాద పరిష్కారం సాకుతో.. రాష్ట్ర విభజనకు రాయల ముసుగు తొడగడం ఎందుకంటూ జైపాల్‌రెడ్డి గట్టిగా వ్యతిరేస్తున్నారు. పది జిల్లాల సెంటిమెంట్ ప్రజల్లో ఉంటే పన్నెండు జిల్లాలను ఇస్తామనడం పక్కలో బల్లెం ఉంచటమేనని ఆయన చెప్తున్నారు. ఇదే విషయమై ఆయన ఇప్పటికే ప్రధాని సహా, పార్టీలోని ఇతర కీలక నేతలతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ‘తెలంగాణ, రాయలసీమ సంస్కృతులు పూర్తిగా భిన్నం. వేష, భాషల్లోనూ ఇరు ప్రాంతాల మధ్య వైరుధ్యం ఉంది. తెలంగాణకు కృష్ణా, గోదావరి నదీ జలాల మణిహారంతో సహజసిద్ధమైన సరిహద్దులున్నాయి. వాటిని కాదని సరిహద్దులు మార్చడం మంచిది కాదు’ అని ఆయన స్పష్టం చేసినట్లు చెప్తున్నారు. రాజకీయ ప్రయోజనాలపై ఆయన వివరిస్తూ ‘తెలంగాణ నిర్ణయంపై అక్కడి ప్రజల్లో పూర్తి స్థాయి సంతృప్తి ఉంది. దాన్ని పక్కదారి పట్టిస్తే టీఆర్‌ఎస్‌కు మరో ఆయుధాన్ని ఇచ్చినట్లే. అనంత, కర్నూలు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ బలంగా ఉంది. వాటిని కలిపితే తెలంగాణలో తిరిగి ఈ పార్టీకి ప్రవేశం కల్పించినట్లే. చంద్రునికో మచ్చలా ఆ రెండు జిల్లాలను కలపడం దేనికి?’ అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. జైపాల్ అభిప్రాయంపై పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందీ తెలియరాలేదు.
కేడర్ యూటర్న్ ఖాయమన్న డీఎస్
రాయల తెలంగాణపై తీవ్ర చర్చజరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీకిచేరుకున్న డీఎస్ సోమవారం ఆంటోనీ సహా, పలువురు ఇతర నేతలను కలుసుకున్నారు. రాయల ప్రతిపాదనపై తన మనోగతాన్ని వారి ముందుంచారు. ‘తెలంగాణ నిర్ణయంతో క్షేత్ర స్థాయిలో కేడర్ అంతా కాంగ్రెస్ వైపు మళ్లింది. ఇప్పుడు రాయల తెలంగాణ అంటే కేడర్ అంతా యూటర్న్ తీసుకోవడం ఖాయం. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఒక్క స్టేట్‌మెంట్ ఇచ్చినా కాంగ్రెస్ ఖతమే’ అని ఆయన స్పష్టంచేసినట్లు చెప్తున్నారు. ఇదే సమయంలో పార్లమెంట్‌లో బిల్లు, జీవోఎం సిఫారసులు తదితర అంశాలపైనా డీఎస్ పార్టీ పెద్దలతో చర్చించారు. అంతకుముందు జైపాల్‌రెడ్డితోనూ ఆయన సుదీర్ఘంగా సమావేశమై రాయల తెలంగాణను అడ్డుకునే విషయమై చర్చలు జరిపారు. ఢిల్లీలో ఉన్న ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, సురేష్ శెట్కార్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ సమావేశమై ఈ విషయమై చర్చించారు.
‘రాయల’ ప్రతిపాదన తెస్తుందనుకోను
తెలంగాణపై పార్టీ ఓ నిర్ణయం తీసుకున్నాక మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెస్తుందని తాను భావించటం లేదని.. ఆంటోనీతో భేటీ అనంతరం డీఎస్ మీడియాతో పేర్కొన్నారు. అయితే రాయల తెలంగాణ కావాలని కొందరు జీవోఎంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. వారి ఒత్తిళ్లకు తలొగ్గే పరిస్థితి ఉండదని, సీడబ్ల్యూసీ తీర్మానం మేరకే విభజన ఉంటుందని చెప్పారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందో, రాదో తాను చెప్పలేనన్నారు. సాధారణ ఎన్నికలకు ముందు రెండు రాష్ట్రాలు ఏర్పడటం తథ్యమని పేర్కొన్నారు.