ఉగ్రవాదులం కాదు..ఉపాధ్యాయులం | Teachers anger against Chandrababu Government | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులం కాదు..ఉపాధ్యాయులం

Jul 12 2018 2:33 AM | Updated on Jul 12 2018 10:51 AM

Teachers anger against Chandrababu Government - Sakshi

బుధవారం విజయవాడ గాంధీనగర్‌ ధర్నాచౌక్‌ వద్ద జరిగిన మహాధర్నాలో పాల్గొన్న ఉపాధ్యాయులు

సాక్షి, అమరావతి: తాము విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులమే కానీ విధ్వంసం సృష్టించే ఉగ్రవాదులం కాదంటూ టీడీపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలు, ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీ, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు సకాలంలో అందజేయాలన్న డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయులు బుధవారం విజయవాడలో భారీ ధర్నా నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి దాదాపు 2,000 మంది ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, బొడ్డు నాగేశ్వరరావుతోపాటు అన్ని విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉపాధ్యాయులు నగరంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ధర్నా చౌక్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రసంగించారు. డిమాండ్ల సాధన కోసం శాంతియుత ర్యాలీ, ధర్నాకు పిలుపునిచ్చామని పేర్కొన్నారు. ఏ తప్పు చేశామని అర్ధరాత్రి అరెస్ట్‌లు చేయాల్సి వచ్చిందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాఠశాలల్లోకి పోలీసులు ప్రవేశించి ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకోవడం దారుణమని మండిపడ్డారు. 

ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి 
ప్రభుత్వం తమ మనోభావాలను దెబ్బతీసిందని, వెంటనే క్షమాపణ చెప్పి రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా నిర్బంధించిన వారందరినీ విడుదల చేయాలని ఫ్యాప్టో చైర్మన్‌ పి.బాబురెడ్డి డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా ధర్నా చేసే హక్కు తమకుందని, దాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఈ నెల 17వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని తేల్చిచెప్పారు. 

టీడీపీకి ఒక న్యాయం.. మాకో న్యాయమా?  
అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ధర్మపోరాట దీక్షల పేరుతో రూ.కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి ధర్నాలు చేస్తే తప్పు కానప్పుడు తాము శాంతియుతంగా నిరసన తెలపడం తప్పెలా అవుతుందని ఉపాధ్యాయులు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకో న్యాయం, తమకో న్యాయమా అని ప్రశ్నించారు. గతంలో ఉపాధ్యాయులతో పెట్టుకున్నందుకు టీడీపీని అధికారానికి దూరంగా ఉంచామని, మరోసారి అందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. టీచర్లతో పెట్టుకుంటే అధికారానికి దూరం కావాల్సిందేనని సీఎం చంద్రబాబే గతంలో వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. 

ప్రభుత్వం దిగివచ్చే దాకా పోరాడుతాం 
ఉపాధ్యాయుల పోరాటాన్ని అణచి వేయాలనే ప్రభుత్వం ప్రయత్నించడం తగదని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ... ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని, వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. 

చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం 
కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బాబురావు ఉపాధ్యాయులను ప్రభుత్వం తరపున చర్చలకు ఆహ్వానించడానికి ధర్నా చౌక్‌కు వచ్చారు. ఫ్యాప్టో తరపున ప్రతినిధులు తమతో వస్తే విద్యాశాఖ కమిషనర్‌తో డిమాండ్లు చెప్పుకోవచ్చన్నారు. సంఘం తరపున 12 మంది సభ్యులు సచివాలయానికి వెళ్లారు. 

13న ముఖ్యమంత్రి కార్యాలయంలో చర్చలు 
ప్రభుత్వ టీచర్లు, విద్యారంగ సమస్యలపై ఈ నెల 13న ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ)లో ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్‌ ఎమ్మెల్సీలతో ప్రభుత్వం చర్చించనుంది. విజయవాడలో ధర్నా అనంతరం నేతలు, టీచర్‌ ఎమ్మెల్సీలతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి) ఆదిత్యనాథ్‌ దాస్‌ వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని తన చాంబర్లో  చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, బొడ్డు నాగేశ్వరరావు, ఫ్యాప్టో నేతలు బాబురెడ్డి, హృదయరాజు, నాగేశ్వరరావు, పాండురంగ వరప్రసాద్, పి.కృష్ణయ్య, జీవీ నారాయణరెడ్డి, రవిచంద్రకుమార్, సుధీర్, కరీముల్లా రావు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్‌ టీచర్లకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ఆటోమెటిక్‌ అడ్వాన్స్‌మెంట్, పండిట్, పీఈటీల అప్‌గ్రెడేషన్, పదోన్నతుల కల్పన వంటి ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని,  ఈ నెల 13న సీఎంఓలో చర్చలకు రావాలని ఆదిత్యనాథ్‌ దాస్‌ సూచించారు. నియోజకవర్గానికి ఒక డిప్యూటీ డీఈఓ పోస్టును ఏర్పాటు చేయడంపైనా ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. అంతర్‌ జిల్లా బదిలీలకు సంబంధించి త్వరలోనే జీఓ జారీ చేస్తామని తెలిపారు. 

1,200 మంది అరెస్టు 
టీచర్లు చేపట్టకుండా మంగళవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల నేతలను ప్రభుత్వం అరెస్టు చేయించింది. అరెస్టయిన వారిపై ఎలాంటి కేసులు పెట్టకుండా విడుదల చేయాలని నేతలు కోరారు. ఆదిత్యనాథ్‌ దాస్‌ డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 1,200 మంది టీచర్లను అరెస్టు చేశారని, అనధికారికంగా 5,000 మందిని అదుపులోకి తీసుకున్నారని నేతలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement