ఎర వేసి.. మోసానికి తెర తీసి..

TDP Targets YSRCP Voters in East Godavari - Sakshi

రూ.ఐదు లక్షల ఇన్సూరెన్స్‌ అంటూ టీడీపీ మోసం

ఆధార్‌ నంబర్, వేలి ముద్రల సేకరణ

పట్టుకున్న వైఎస్సార్‌ సీపీ నేతలు

ఓట్ల తొలగించేందుకేననే అనుమానాలు

ఎన్నికల అధికారికి ఫిర్యాదు

తూర్పుగోదావరి, రామచంద్రపురం:  టీడీపీ నేతలు ఓటర్లను మభ్యపెట్టేందుకు  వేస్తున్న ఎత్తుగడలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా రూ.ఐదు లక్షల ఇన్సూరెన్స్‌ అంటూ కోడ్‌ ఉల్లంఘన చేస్తున్న వైనం మండలంలోని కాపవరంలో శుక్రవారం వెలుగు చూసింది. అయితే స్థానిక టీడీపీ నేత చెప్పడంతోనే ఈ విధంగా చేస్తున్నానని సదరు వ్యక్తి అనడంతో అసలు మోసం బయట పడింది. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కార్యకర్తలు, నాయకులతో కలిసి ‘రావాలి జగన్‌ కావాలి జగన్‌’ కార్యక్రమంలో భాగంగా పాదయాత్రకు వెళ్లారు. ఒక ఆలయం వద్ద సుమారుగా 200 మంది మహిళలు ఉండడంతో ఆయన వారి వద్దకు వెళ్లి ఏం జరుగుతుందని ఆరా తీశారు. ఎవరో వచ్చారని, స్థానిక యానిమేటర్‌ ఆధార్‌ కార్డులు తీసుకురావాలని చెబితే వచ్చామని తెలిపారు.

అయితే అక్కడ పెదపూడి మండలం యాడ్ర గ్రామానికి చెందిన ఆచంట గోపాల్‌ అనే యువకుడు మహిళల నుంచి ఆధార్‌ నంబర్‌ తీసుకుని వేలిముద్రలు సేకరిస్తున్నాడు. ఎందుకోసం వేలి ముద్రలు తీసుకుంటున్నారని ఆ యువకుడిని ప్రశ్నించగా ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్‌ సాక్షాత్ర అభియాన్‌ పథకం ద్వారా డిజిటలైజేషన్‌ చేస్తున్నానని, ఒక్కొక్కరికి రూ.ఐదు లక్షలు ఇన్సూరెన్సు వస్తుందని చెప్పాడు. ఎన్నికల కోడ్‌ ఉన్న నేపథ్యంలో ఇలా ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తే అవిషయాలు తనకు తెలియదని చెబుతూ గత ఏడాది మే నెలలో జేసీ మల్లికార్జున్‌ పేరు మీద ఉన్న ఆర్డర్‌ కాపీని చూపించారు. దీనిపై ఉన్న జిల్లా కో ఆర్డినేటర్‌ జి.రవికిరణ్‌కు ఫోన్‌ చేసి ఎన్నికల కోడ్‌ ఉన్న సమయంలో ఇలా ఎందుకు చేస్తున్నారని అడుగగా సరైన సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన కో ఆర్డినేటర్‌ వేణు ఆర్డీఓ ఎన్‌.రాజశేఖర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేయగా ఎంపీడీవో పీవీవీ సత్యనారాయణ, ఈవోపీఆర్డీ రామకృష్ణారెడ్డిని సంఘటన స్థలానికి పంపారు. అధికారులు అక్కడి వచ్చి డిజిటలైజేషన్‌ చేస్తున్న వ్యక్తి నుంచి కంప్యూటర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తాను స్థానిక టీడీపీ నేత రెడ్నం సతీష్‌ చెప్పడంతోనే ఇక్కడికి వచ్చి డ్వాక్రా మహిళల నుంచి వేలి ముద్రలు, ఆధార్‌ నంబర్లను తీసుకుంటున్నట్టు చెప్పాడు. ఇలా దొడ్డిదారిన టీడీపీ నేతలు మోసాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు అంటున్నారు.

ఉన్నతాధికారులకు నివేదిస్తాం..
ఈ విషయంపై ఎంపీడీవో సత్యనారాయణను స్థానిక విలేకరులు వివరణ కోరగా.. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఇటువంటివి చేయకూడదని దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటామని సంబందిత వ్యక్తిని పోలీసులకు అప్పగించామని, ఆయన వద్ద ఉన్న కంప్యూటర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్టు చెప్పారు. టీడీపీ చేస్తున్న మోసాలకు పరాకాష్ట: ఎన్నికల్లో ఏదోలా గెలవాలనే ధ్యేయంతో టీడీపీ చేస్తున్న మోసాలు పరాకాష్టకు చేరాయని కో ఆర్డినేటర్‌ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు.  దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారికి, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top