పందేలకు రె‘ఢీ’

TDP Leaders participate Hen Fights in East Godavari - Sakshi

పోలీసు ఆదేశాలు బేఖాతరు

నిర్వహణకు సన్నాహాలు

పలుచోట్ల బరులు సిద్ధం

తూర్పుగోదావరి, అమలాపురం: ‘కోడిపందేలు నిర్వహించే అవకాశం లేదని.. అడ్డుకుని తీరుతామని’ ఎప్పటిలానే పోలీసులు గత కొన్ని రోజులుగా ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. మరోవైపు గడిచిన రెండు రోజులుగా పందేల నిర్వాహకులు యథావిధిగా సన్నాహాలు చేస్తూనే ఉన్నా రు. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోను పందేలను అడ్డుకునే అవకాశం లేదని నిర్వాహకులు బలంగా విశ్వసిస్తున్నారు. చూసీచూడనట్టుగా వదిలేయండి అని ఉన్నతాధికారు ల నుంచి అనధికార ఆదేశాలు రాకపోవడంతో పందేల నిర్వహణను అడ్డుకోవాలో, వదిలేయాలో తెలియక పోలీసులు మీమాంసలో ఉండడం గమనార్హం.

సంక్రాంతి మూడు రోజులు ఈ ఏడాది కూడా పందేలు జోరుగా సాగనున్నాయి. తమకు చెడ్డపేరు వస్తోందని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు నేరుగా పందేలు నిర్వహించడానికిదూరంగా ఉండగా, కొంతమంది తమ అనుచరులతో కానిస్తున్నారు. పందేలకు అనుమతి లేదని పోలీసులు, అధికార పార్టీ పెద్దలు చెబుతున్నా నిర్వాహకులు మాత్రం యథావిధిగా బరులు సిద్ధం చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పందేలకు అనుమతి ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంశాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత ఇలాకా పెద్దాపురం నియోజకవర్గంలోనే భారీ ఎత్తున పందేలు జరిగే అవకాశముంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఈ ఏడాది కూడా పందేలు జోరుగా సాగనున్నాయి. నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే నియోజకవర్గంలోని అచ్చంపేట– తిమ్మాపురం జంక్షన్, వాలు తిమ్మాపురం, జి.రాగంపేటలో పందేలు జరగనున్నాయి. ఆర్థికమంత్రి ఇలాకా తునిలో కోడిపందేలు జోరుగా సాగనున్నాయి. తుని మండలం తేటగుంటలో పెద్ద ఎత్తున పందేలు జరగనున్నాయి.

అమలాపురం నియోజకవర్గ పరిధిలో గోడిలంక, ఇందుపల్లి, ఎన్‌.కొత్తపల్లి, కూనవరంలో పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. అమలాపురం మండలం సమనసలో పందేల నిర్వహణ కోసం వేసిన టెంట్లను రెవెన్యూ అధికారులు తొలగించారు. అయినా ఇక్కడ పందేలు జరుగుతాయని నిర్వాహకులు చెప్పడం విశేషం. జగ్గంపేటలో కిర్లంపూడి, మర్రిపాక, రాజానగరంలో జి.ఎర్రంపాలెం, పుణ్యక్షేత్రం, దివాన్‌చెరువు, ఏజెన్సీలో దేవీపట్నం, గంగవరం, పిఠాపురంలో పి.దొంతమూరు, ఇసుకపల్లి, కొమగిరి, విరవలలోను,  మండపేట, ద్వారపూడి, కపిలేశ్వరపురం లంకలు, రాయవరం, రాజమహేంద్రవరం రూరల్‌లో వేమగిరి, బుర్రిలంక, జేగురుపాడు, ముమ్మిడివరం చెయ్యేరు, గెద్దనాపల్లి ప్రాంతాల్లో పందేల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్తపేటలో తొలిసారిగా పందేలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ స్పీకర్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం అండదండలతో ఇక్కడ పందేల నిర్వహణకు అధికార పార్టీలో కీలక నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ ఆత్రేయపురం, రావులపాలెంలో సైతం పందేలు జరగనున్నాయి. రాజోలు నియోజకవర్గంలో ఇంచుమించు అన్ని మండలాల్లోను పందేలు జరగనున్నాయి. పశ్చిమ గోదావరిలో భారీగా పందేలు జరిగే అవకాశం ఉండడంతో ఇక్కడ పెద్ద పందేల సంఖ్య చాలా తక్కువ. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో కాట్రేనికోన మండలం గెద్దనాపల్లి వంటి చోట భారీ పందేలు జరుగున్నాయి.

మురమళ్లలో పందేలు లేవు
కోడిపందేల నిర్వహణలో జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలో గుర్తింపు సంతరించుకున్న ఐ.పోలవరం మండలం మురమళ్లలో ఈసారి పందేల నిర్వహణ లేకుండా పోయింది. ఇక్కడ పందేల నిర్వహణకు గ్యాలరీతో కూడిన స్టేడియంను, ఎల్‌సీడీలను ఏర్పాటు చేయడం, బిర్యానీల వంటి విందులు ఉండేవి. రాష్ట్రం నలుమూలల నుంచి పందేలలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చేవారు. గత ఏడాది పందేల విషయంపై న్యాయస్థానం సీరియస్‌ కావడంతో పందేలకు బ్రేకులు పడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పందేల నిర్వహణ వల్ల తనకు చెడ్డపేరు వస్తోందని నిర్వహణకు దూరంగా ఉన్నారు. అయితే ఐ.పోలవరం మండలం కొమరగిరిలో భారీ ఎత్తున బరులు ఏర్పాటు చేసి పందేల నిర్వహణకు సమాయత్తం అవుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top