నీళ్లను కూడా అమ్ముకుంటున్న తెలుగు తమ్ముళ్లు

TDP Leaders Loot irrigation Water - Sakshi

మీకోసం కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు

గుంటూరు వెస్ట్‌: దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్టు వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. మట్టి, ఇసుక అమ్ముకుని కోట్లు గడించిన నేతలు చివరకు రైతులకు అందాల్సిన సాగునీటిని కూడా దారి మళ్లించి అమ్మేసుకుంటున్న వైనం సోమవారం మీ కోసం కార్యక్రమంలో వెలుగులోకి వచ్చింది. అమరావతి మండలం నరుకుళ్ళపాడు, పరిసర గ్రామాల రైతులు దాదాపు 400 మంది వచ్చి ఈ విషయమై నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎ.ఎం.డి.ఇంతియాజ్, డి.ఆర్‌.ఒ.శ్రీలత, జెడ్పీ సీఈఓ సూర్య ప్రకాశరావు, జె.సి–2 విజయ్‌ చందర్‌ తదితరులు పాల్గొన్నారు. మీ కోసం కార్యక్రమానికి వచ్చిన కొన్ని ఫిర్యాదులివి. 

నీళ్ళు అమ్ముకుంటారా?
రైతు ప్రభుత్వం అని చెప్పుకునే టీడీపీ ప్రభుత్వం అదే రైతుల నోట్లో మట్టి కొడుతుంటే అధికారులు వేడుక చూస్తున్నారు. పాటిబండ్ల, మండెపూడి డొంక ద్వారా నరుకుళ్ళపాడు ఎం.మైనర్‌ కాలువకు వచ్చే నీటిని అధికార పార్టీ కార్యకర్తలు తూముల ద్వారా నీటిని మళ్లించి అక్రమంగా ట్యాంకర్ల ద్వారా విక్రయించుకుంటున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో దాదాపు 300 ఎకరాలకు నీళ్లు అందడంలేదు. బీద బడుగు వర్గాల రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో స్థానిక అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితంలేదు. కలెక్టర్‌ గారు స్పందించి న్యాయం చేయకపోతే రాస్తారోకో చేస్తాం.
–కె.హరిబాబు, అల్లం దేవదానం రెడ్డి తదితరులు

తహసీల్దార్‌ అమ్ముడుపోయి మాకు అన్యాయం చేశాడు
మాది శావల్యాపురం మండలం మతుకుమల్లి గ్రామం. ఇక్కడ మాకు ఎకరం పొలం ఉంది. దీనికి పట్టాదారు, రైతు హక్కు పుస్తకం, బి–1 ఫారాలు, శిస్తు అన్నీ ఉన్నాయి. మా పొలం సరిహద్దులో ఉండే  వ్యక్తికి అమ్ముడుపోయిన తహసీల్దార్, వీఆర్వోలు మాకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. మా అమ్మకు ఇప్పుడు 70 ఏళ్లు. అధికారులు మాకు న్యాయం చేయకపోగా  ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
–ఎం.రంగమ్మ, కుమారుడు

వికలాంగులనే కనికరం కూడా లేదా?
నా కుమార్తె కమలకు వినబడదు, మాట్లాడలేదు. గతంలో మాకు మానసిక వికలాంగురాలు కింద సర్టిఫికెట్‌ ఇచ్చారు. వాస్తవానికి మాకు రావాల్సింది డెఫ్‌ అండ్‌ డంబ్‌ సర్టిఫికెట్‌. దీనికోసం ఎన్నో పర్యాయాలు తిరిగినా ఫలితం లేదు. జీజీహెచ్‌కు వెళ్లమని చెబుతున్నారు. అక్కడ మా గోడు వినేవాడే లేడు. గతంలోనూ కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాం. వికలాంగుల పట్ల కాస్త దయతలచండి.
–జానపాటి విద్యావాణి

పేదలకందని ప్రభుత్వ పథకాలు
ఓ  ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు నెలకు రూ.35 వేలు జీతం తీసుకుంటోంది. ఆమె భర్తకు తెల్ల రేషన్‌ కార్డు ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్‌లో రూ.2 లక్షలు రుణం కూడా పొందాడు. ఈ విషయాలను ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురించినా ఎందుకు చర్యలు చేపట్టలేదు. నేను ఎంతో కాలంగా తెల్ల రేషన్‌ కార్డు కోసం తిరుగుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. 
–ఎం.జార్జి, తాడేపల్లి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top