వేసేయ్‌ పాగా.. కాజేయ్‌ జాగా!

Tdp Leaders Land Mafia in ATMAKUR - Sakshi

ప్రభుత్వ పాలన మనదే కదాని తెలుగు తమ్ముళ్లు ఆక్రమణలకు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలే కదా అని పాగా వేసి.. జాగా కాజేస్తున్నారు. అధికారం ముసుగులో ప్రభుత్వ స్థలాల భక్షకులుగా మారుతున్నారు. వారే కాదు వారి బంధువులు సైతం దర్జాగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నెల్లూరు–ముంబాయి జాతీయ రహదారి ఎన్‌హెచ్‌–67పై రోడ్డు పక్క స్థలాలు ఆక్రమించుకుంటూ వ్యాపార గదులు నిర్మించి అడ్వాన్సులు, అద్దెల రూపంలో లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు.    

ఆత్మకూరు: గత స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మేజర్‌ పంచాయతీగా ఉన్న ఆత్మకూరు మున్సిపాలిటీగా,  ఆ తర్వాత రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా అభివృద్ధి చెందడంతో అంతే వేగంగా పట్టణంలో ఆక్రమణలు జోరందుకున్నాయి. రాష్ట్ర రహదారిగా ఉన్న నెల్లూరు–ముంబయి రోడ్డు సైతం జాతీయ రహదారిగా మారడంతో ఇటీవల కోట్లాది రూపాయలతో నాలుగు లైన్ల రహదారిగా విస్తరించారు. వాహనాల రద్దీ పెరిగి వ్యాపారాల నిర్వహణకు అనువుగా తయారైంది. ఇదే అదనుగా స్థానిక టీడీపీ నేతలు మున్సిపల్‌ పాలకవర్గానికి చెందిన కొందరు నాయకులు దర్జాగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి గదులు నిర్మిస్తున్నారు. గత ఏడాది ఓ నాయకుడు నెల్లూరుపాళెం సెంటర్‌లో ఐదు గదులతో కాంప్లెక్స్‌ నిర్మించి అద్దెలకు ఇచ్చేశాడు. ఓ పేదవాడు బతుకుదెరువు కోసం రోడ్డు పక్కన దుకాణం నిర్ధాక్షిణ్యంగా తొలగించిన అధికారులు టీడీపీ నేతల ఆక్రమణల వైపు కన్నెత్తి చూడటం లేదు.  

అది నీకు.. ఇది నాకు  
ఆక్రమణల్లోనూ తెలుగు తమ్ముళ్లు సమన్యాయం పాటిస్తున్నారు. పాలకవర్గానికి చెందిన ఓ ముఖ్య నేత అండదండలతో స్థానిక టీడీపీ నాయకులు ఓ కౌన్సిలర్‌ సమీప బంధువు ఈ ఆక్రమణల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలాన్ని ప్రధాన రోడ్డుకు అనుసంధానం చేస్తూ చదును చేసేందుకు మట్టి కూడా తొలి సిద్ధంగా ఉంచారు. మరో రెండు రోజుల్లో ఈ స్థలాన్ని చదును చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ముందుగా ఇలా మట్టి తొలి..ఆ తర్వాత ఆక్రమించడం పరిపాటిగా మారింది. మరెవరూ ఈ స్థలాల జోలికి రాకుండా అడ్డుగా కంపకర్ర సైతం వేశారు. దీనికి తోడు సెంటర్‌లో కొంత స్థలాన్ని స్థానిక టీడీపీ నేత సొంతంగా ఆక్రమించి గదులు కట్టేందుకు మెటిరియల్‌ చేర్చేశాడు. ఇలా తెలుగు తమ్ముళ్ల ఆ స్థలం నీకు ఈ స్థలం నాకు మరో స్థలం మన మరో నాయకుడికి అంటూ కేటాయింపులు చేసుకోవడంతో స్థానికులు ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆక్రమణల విషయం మున్సిపల్, రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకునే పరిస్థితి లేదు.  

మట్టి సైతం  
ఈ ఆక్రమిత స్థలాల్లో చదును చేసేందుకు తోలిన మట్టి సైతం పట్టణంలోని పాత పంచాయతీ కార్యాలయం లగించిన అనంతరం చదును చేసే క్రమంలో వచ్చిన మట్టిని ఇక్కడకు తరలించారు. ఈ మట్టి తొలగించేందుకు మున్సిపాలిటీ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. అయితే ఆ మట్టిని సైతం తెలుగు తమ్ముళ్లు తాము ఆక్రమించిన స్థలాలకు కొంత తోలుకోగా మరికొంత మట్టిని ట్రాక్టర్‌ రూ.300 చొప్పున అమ్ముకున్నారు. ఇలా బరి తెగించి తెలుగు నేతలు ప్రవరిస్తున్న తీరును చూసి పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు పరిశీలించి ఆక్రమణలను నిరోధించాలని ప్రజలు కోరుతున్నారు. 

ఆక్రమిత స్థలాల్లో బోర్డులు పెడతాం  
మున్సిపల్‌ పరిధిలోని నెల్లూరుపాళెం సెంటర్‌ వద్ద జాతీయ రహదారిపై ఆక్రమిత స్థలాల్లో ప్రభుత్వ స్థలాలనే బోర్డులను ఏర్పాటు చేస్తాం. గతంలో జాతీయ రహదారికి విస్తరించక ముందు అనాదిగా దుకాణాలను పెట్టుకున్న వారికి మాత్రమే అవకాశమిస్తాం. మరెవరైనా కొత్తగా ఏర్పాటు చేస్తా ఉపేక్షించాం. ఆక్రమణలను తొలగిస్తాం.        
వీ శ్రీనివాసరావు, కమిషనర్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top