చీపురుపల్లి టీడీపీలో వార్‌

tdp leaders internal fights in vizianagaram - Sakshi

త్రిమూర్తులు రాజుపై మృణాళిని, గద్దేల ఫిర్యాదు

అమరావతిలో సమావేశంపై గరం గరం

నియోజకవర్గంలో మొదలైన తిరుగుబాటు

క్షమాపణ చెప్పకపోతే తడాఖా  చూపిస్తానంటున్న కేటీఆర్‌

చీపురుపల్లి: నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వార్‌ మొదలయ్యింది. ఇంతవరకు అంతర్గతంగా ఒకరిపై మరొకరు విమర్శించుకునే స్థాయి నుంచి బాహాటంగా ఫిర్యాదులు చేసుకునే పరిస్థితికి రావడంతో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఒకే పార్టీలో ఉంటూ ఏకంగా ప్రెస్‌మీట్లు పెట్టి మ రీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేసుకునే స్థాయికి చేరడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం అమరావతిలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్వహించిన జిల్లా సమన్వయకమిటీ సమావేశంలో నియోజకవర్గ టీడీపీ నేత కె.త్రిమూర్తులురాజు(కేటీఆర్‌)పై ఎమ్మెల్యే మృణాళిని, మాజీ ఎమ్మెల్యే గద్దేబాబూరావు ఫిర్యాదు చేయడంతో వారి మద్య విభేదాలు రోడ్డునపడేలా చేసిందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కిమిడి మృణాళిని సొంత నియోజకవర్గంలో ఆమెతో బాటు ము ఖ్య నేతల్లో ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. 

కేటీఆర్‌ తిరుగుబాటు
సమన్వయ కమిటీలో తనపై చేసిన ఫిర్యాదులపై త్రిమూర్తులు రాజు గురువారం చీపురుపల్లిలో విలేకరుల సమావేశంలో స్పందించారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించుకోవాలని... లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేయడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అక్కడితో ఆగకుండా వారిద్దరూ క్షమాపణ చెప్పకపోతే తానేంటో ప్రజాక్షేత్రంలో నిరూపిస్తానని హెచ్చరించడంతో తెలుగుదేశం పార్టీలో ఆసక్తికర చర్చకు తెరలేచింది. 

గత ఎన్నికల నుంచే...
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఎమ్మెల్యే మృణాళిని, మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి కె.త్రిమూర్తులురాజుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఎన్నికలు జరిగిన తరువాత దాదాపు ఏడాదిన్నర వరకు వీరంతా ఎక్కడా కలిసి తిరగలేదు కూడా. తరువాత కాలంలో త్రిమూర్తులురాజు వారితో కలసి పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నప్పటికీ లోలోపల వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు పార్టీ సమన్వయకమిటీలో వ్యవహారం ఈ విషయాన్ని వారి మధ్య విభేదాలు పెరిగేలా చేశాయి.

వాడుకుని వదిలేశారని...
కేటీఆర్‌ను తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో వాడుకుని వదిలేసిందని ఆయన వర్గీయుల వాదన. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా మారిన ఆయన 2014 వరకు పార్టీని నడిపించారు. ఎన్నికల సమయంలో కుల ప్రాతిపదికన ఆయనకు టిక్కెట్టు ఇవ్వకుండా కిమిడి మృణాళినికు కేటాయించడం ఆమె విజయం సాధించడం తెలిసిందే. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన త్రిమూర్తులురాజు అధిష్టానం నుంచి వచ్చిన హామీతో ఉపసంహరించుకున్నారు. కాని ఆ హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకూ ఎమ్మెల్సీ పదవిని గద్దే, త్రిమూర్తులు కూడా ఆశించారు. అధిష్టానం వద్ద ఎవరి ప్రయత్నాలు వారు సాగించారు. ఇద్దరికీ అక్కడ మొండిచెయ్యే ఎదురైంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయన్న నేపథ్యంలో ఈ వివాదాలు నియోజకవర్గ టీడీపీకి నష్టమేనన్న ప్రచారం జరుగుతోంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top