టీడీపీలో తేలని పంచాయితీ

TDP Leaders Fight to Election Seats - Sakshi

పాలకొండలో కిషోర్‌ వెర్సెస్‌ కళా

పాతపట్నంలో కలమటకు వ్యతిరేక పవనాలు

ఆయన వద్దంటూ తీర్మానం చేసిన మండల నాయకులు

సాక్షి, పాలకొండ: నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి విషయంలో ఇప్పటికీ పంచాయితీ తేలలేదు. నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు కుమార్తె స్వాతిల మధ్య టికెట్‌ కోసం వర్గపోరు కొనసాగుతోంది. జయకృష్ణకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు మద్దతు అందిస్తుండగా, స్వాతికి ఇటీవలే పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్‌చంద్ర సూర్యనారాయణ దేవ్‌ వెన్నుదన్నుగా నిలిచారు. తల పట్టుకున్న పార్టీ అధిష్టానం టికెట్‌ కేటాయింపులో ఇప్పటికీ ఫోన్‌ సర్వేలపైనే ఆధారపడుతోంది.

జయకృష్ణకు టికెట్‌ ఇస్తే తాము పార్టీకి పనిచేయమని పాలకొండ, వీరఘట్టం మండలాలకు చెందిన మండల స్థాయి నాయకులు చంద్రబాబు సమక్షంలోనే తేల్చారు. దీనికి తోడు చంద్రబాబుకు పలుమార్లు జయకృష్ణ తీరుపై ఫిర్యాదులు అందాయి. ఈ విషయాలను పరిగణనలోనికి తీసుకుని టికెట్‌ కేటాయించే పరిస్థితి లేదని జయకృష్ణ వ్యతిరేక వర్గం గట్టిగా చెబుతున్నారు.

ఇక స్వాతి విషయంలో పార్టీలో చేరిన వారం రోజుల్లోనే టికెట్‌ ఎలా ఇస్తారని జయకృష్ణ వర్గం వాదిస్తోంది. దీంతో ఈ వ్యవహారం  ముదిరింది. ప్రస్తుతం పాలకొండ టికెట్‌ విషయంలో కిషోర్‌చంద్ర దేవ్, కళా వెంకటరావుల మధ్య ఆధిపత్య పోరుకు తెరతీసింది. పార్టీ కార్యకర్తల్లో ఈ ఇద్దరి నేతల మధ్య ఎవరు పైచేయి సాధిస్తారని చర్చించుకుంటున్నారు...

పాతపట్నం...
పాతపట్నంలో ఫిరాయింపు ఎమ్మెల్యే కలమటకు ఈసారి వింత పరిస్థితి నెలకొంది. అవినీతి ఆరోపణలతో ఈసారి టికెట్‌ కష్టంగా మారింది. అయితే దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామోహన్‌నాయుడు పట్టుతో టికెట్‌ రేసులో నిలిచారు. అధికారికంగా టికెట్‌ ప్రకటించక పోయినా వస్తుందన్న ప్రచారం జరిగింది.

దీంతో పాతపట్నం నియోజకవర్గంలోని మండల స్థాయి నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు కలమటకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. ఈ పరిణామాలతో కంగుతిన్న చంద్రబాబు వెంటనే పాతపట్నం నాయకులను అమరావతి రావాలని కబురు పంపారు. మండల స్థాయి నాయకులకు నచ్చచెప్పే పనిని కింజరాపు కుటుంబం నెత్తిన పెట్టుకుంది. ఈ పరిణామాల మధ్య ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపిక సాగుతోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top