టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

TDP Leaders Conflicts in Tadipatri - Sakshi

ట్రాన్స్‌పోర్టు విషయంలో ఇరువర్గాల ఘర్షణ

తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తత

సాక్షి, తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాలుగా చీలిపోయిన జేసీ అనుచరులు ట్రాన్స్‌పోర్ట్‌ విషయంలో ఘర్షణపడ్డారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఓ వర్గం వారి ఇంటిపై దాడి చేయడంతో తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేసీ సోదరులతో ప్రధాన అనుచరుడు కాకర్ల రంగనాథ్‌కు విభేదాలు తలెత్తాయి. దీంతో రంగనాథ్‌ జేసీ వర్గం నుంచి వైదొలిగి స్తబ్ధుగా ఉన్నాడు. జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సర శుభాకాంక్షలుతెలిపేందుకు మంత్రి పరిటాల సునీత ఇంటికి కాకర్ల రంగనాథ్, టీడీపీ సీనియర్‌ నాయకులు జగదీశ్వర్‌రెడ్డి, ఫయాజ్‌బాషాలు వెళ్లారు.

 దీన్ని జీర్ణించుకోలేని జేసీ వర్గంలోని కొందరు కాకర్ల రంగనాథ్‌ సోదరుడు నిర్వహిస్తున్న ‘అన్న ట్రాన్స్‌పోర్ట్‌’ కార్యాలయంపై దాడి చేశారు. అక్కడే నిలిపి ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డే దాడి చేయించారని అప్పట్లో కాకర్ల రంగనాథ్‌ సీనియర్‌ నాయకులు జగదీశ్వర్‌రెడ్డి, ఫయాజ్‌బాషాలతో కలసి ప్రత్యక్షంగా ఆందోళనకు దిగిన విషయం విదితమే. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

దాడి.. ప్రతిదాడి
చాపకింద నీరులా ఉన్న నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఈ క్రమంలో ట్రాన్స్‌పోర్ట్‌ విషయమై పట్టణంలోని నందలపాడుకు చెందిన జేసీ అనుచరులు శివ, ప్రసాద్‌లపై శనివారం ప్రత్యర్థులు దాడి చేసి గాయపరిచారు. టీడీపీకి చెందిన కాకర్ల రంగనాథ్‌ వర్గీయులే దాడి చేసి ఉంటారని భావించిన జేసీ వర్గీయులు కాకర్ల రంగనాథ్‌ బామ్మర్ది అయిన ప్రసాద్‌నాయుడు ఇంటిపై దాడిచేసి, సామగ్రిని ధ్వంసం చేశారు. పరస్పర దాడులతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గాయపడిన ప్రసాద్, శివలను అనంతపురం ఆస్పత్రికి తరలించారు.  అయితే ఇరు వర్గాల వారికీ రాజీ కుదరడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top