ఎన్టీఆర్‌ సాక్షిగా టీడీపీలో వర్గపోరు

TDP Leaders Conflicts in NTR Death Anniversary - Sakshi

ఎమ్మెల్యే వస్తున్నారంటూ రెండో వర్గాన్ని అడ్డుకున్న పోలీసులు

పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై ధర్నా

బలవంతంగా పోలీసుస్టేషన్‌కు తరలింపు

ప్రకాశం చీరాల అర్బన్‌: ఎన్నికల వేళ చీరాల తెలుగుదేశం పార్టీలో మళ్లీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం పార్టీలో మూడు ముక్కలాట కొనసాగుతోంది. శుక్రవారం ఎన్టీఆర్‌ వర్ధంతి సాక్షిగా పార్టీలో వర్గపోరు బహిర్గతమైంది. ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించేందుకు పోలీసులు అడ్డుకున్నారంటూ కొందరు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు చీరాల పోలీసులు వత్తాసుగా మారారని, చివరకు  పార్టీ వ్యవస్థాపకుడి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా చేసుకునేందుకు వీల్లేకుండా పోయిందని, చీరాలలో నిజమైన టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని మరో వర్గానికి చెందిన నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

ఏం జరిగిందంటే..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరిత తారక రామారావు 23వ వర్ధంతి సందర్భంగా చీరాల ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. చీరాలలో టీడీపీ రెండో వర్గంగా ఉన్న సజ్జా వెంకటేశ్వరరావు, ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పి.అరుణ, నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ర్యాలీగా గడియారం స్తంభం సెంటర్‌ నుంచి బయల్దేరారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సభకు వస్తున్నారంటూ పోలీసులు రెండో వర్గం నాయకులను అడ్డుకున్నారు. ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు వెళ్లొద్దంటూ పోలీసులు అడ్డుకున్నారు. తామెందుకు వెళ్లకూడదో చెప్పాలంటూ నినాదాలు చేశారు. డీఎస్పీ వి.శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని పార్టీ నాయకులతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు అనుమతించేది లేదని ఆయన చెప్పడంతో పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. చీరాలలో నిజమైన టీడీపీ కార్యకర్తలు తామేనని, తమను కూడా వెళ్లనీయకుండా చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు కూడా ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేసుకున్నామని, కొంతమందైనా వెళ్లి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామని చెప్పినా పోలీసులు అనుమతించలేదు. ఆగ్రహానికి లోనైన టీడీపీ నేతలు పోలీసుల తీరుకు నిరసనగా పొలిమేర రోడ్డులో బైఠాయించి నినాదాలు చేశారు. తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షడి విగ్రహానికి నివాళులర్పించడం తప్పా..అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొద్దిసేపటికి పోలీసులు పార్టీ నాయకులను బలవంతంగా వ్యానుల్లో ఎక్కించి టూటౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. గంటన్నర సేపు పోలీసులు, టీడీపీ నాయకులకు మధ్య జరిగిన వాదోపవాదాలకు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ఆది నుంచీ అంతే..
చీరాల తెలుగుదేశం పార్టీలో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. 2014 ఎన్నికల తర్వాత నుంచి టీడీపీలో వర్గపోరు మొదలైంది. చీరాలలో ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే ఆమంచి వర్గానికి మధ్య వర్గపోరు నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమం పోటాపోటీగా నిర్వహించడం, అడ్డుకుంటే నిరసనలకు దిగడం పరిపాటిగా మారింది. రెండు వర్గాలు పోటీగా పార్టీ కార్యక్రమాలు చేపట్టడంతో ఎప్పుడూ ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటోంది. తెలుగుదేశంస్థాపించిన నాటి నుంచి పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్నామని, నిజమైన కార్యకర్తలకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతోందని పార్టీ నాయకులు వాపోతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top