చీరలు ఇస్తామంటూ రప్పించి.. ఉసూరుమనిపించారు

TDP Leaders Cheated Womens With Pasupu kumkuma Sarees named - Sakshi

పసుపు– కుంకుమ చీరలంటూ టీడీపీ నేతల హడావుడి

చీరల కోసం వచ్చిన మహిళల మధ్య తొక్కిసలాట

చీరలు తీసుకోకుండానే వెనుదిరిగిన మహిళలు

గుంటూరు, దాచేపల్లి: పసుపు కుంకుమ చీరలు ఇస్తామని టీడీపీ నేతలు మహిళలను రప్పించి తీరా ఉసూరుమనిపించారు. నడికుడి పంచాయితీ పరిధిలోని నారాయణపురం బ్రహ్మనాయుడు ఆడిటోరియంలో సోమవారం జరిగిన పసుపు కుంకుమ చీరల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పంపిణీ చేసే చీరల కోసం మహిళలందరూ గుంపుగా రావటంతో తొక్కిసలాట జరిగి పలువురు మహిళలకు గాయాలు కాగా మరికొందరు నగలు, నగదు పోగొట్టుకున్నారు. మహిళలను అదుపు చేయలేక టీడీపీ నాయకులు చేతులెత్తేశారు. చీరలు పంపిణీ చేయలేక ఆటోల్లో తరలిస్తుండగా వాటిని చూసిన మహిళలు స్లిప్‌లు తీసుకుని ఇవ్వాలని కోరినా టీడీపీ నాయకులు పట్టించుకోకుండా ఇప్పుడు ఇచ్చేది లేదంటూ వెళ్లిపోవడానికి ఉపక్రమించారు. దీంతో మహిళలు ఒక్కసారిగా ఆటోవైపు పరుగులు తీశారు. సభలో చీరలు ఇస్తారనే ఆశతో కూలి పనులు మానుకొని వచ్చిన  మహిళలకు చివరకు చీరలు ఇవ్వకుండానే ఇంటికి పంపించారు. టీడీపీ నాయకులు మీ ఇళ్ల వద్దకు వచ్చి చీరలు ఇస్తామని ప్రకటించటంతో సభకు వచ్చిన మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

చీరలు, స్వీట్లు ఇస్తామని...
బ్రహ్మనాయుడు ఆడిటోరియంలో జరిగిన పసుపు కుంకుమ చీరల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే ప్రసంగించిన తరువాత చీరలు, స్వీట్లు పంపిణీ చేస్తామని టీడీపీ నాయకులు ప్రకటించారు. ఎమ్మెల్యే ప్రసంగం ముగిసిన తరువాత కొంతమంది మహిళలకు మాత్రమే చీరలు ఇచ్చారు. ఆ తరువాత చీరలు తీసుకునేందుకు టీడీపీ నాయకులు ఇచ్చిన స్లిప్‌లను తీసుకుని కౌంటర్ల వద్దకు వెళ్లారు. సభలో పాల్గొన్న మహిళందరూ ఒకేసారి కౌంటర్ల వద్దకు రావటంతో చీరలు తీసుకునేందుకు పోటీపడ్డారు. కౌంటర్‌ వద్ద రద్దీ పెరిగి తొక్కిసలాట జరిగింది. కొందరు మహిళలకు గాయాలయ్యాయి. తొక్కిసలాట లో ఊపిరి ఆడక పలువురు ఇబ్బందులు పడ్డారు.  చీరల కౌంటర్‌ వద్దకు వచ్చిన వృద్ధులు కిందపడ్డారు.  కొంతమంది మహిళలు నగదు, బంగారం పొగొట్టుకున్నారు. కొంతమంది మహిళలకు మాత్రమే చీరలు ఇచ్చారు.

మహిళలను తరలించిన ఐకేపీ,  మండల సమాఖ్య సభ్యులు, వీవోలు
పసుపు, కుంకుమ సభకు మండలంలోని డ్వాక్రా మహిళలను తరలించేందుకు ఐకేíపీ, మండల సమాఖ్య సభ్యులు, వీవోలు కీలక ప్రాత పోషించారు. ఈ సభలో పాల్గొంటేనే రుణాలు వస్తాయని, లేదంటే ఇబ్బందులు పడతారని డ్వాక్రా మహిళలను పరోక్షంగా బెదిరించారు. సభకు వచ్చిన వారికి చీరలు, స్వీట్లు కూడా ఇస్తారని చెప్పి స్లిప్‌లు పంపిణీ చేశారు. గ్రామాల్లోకి ఆటోలు పంపిస్తామని ఐకేపీ, టీడీపీ నాయకులు చెప్పినప్పటికి కొన్ని గ్రామాలకు ఆటోలు రాకపోవటంతో మహిళలు సొంత ఖర్చులతో సభకు వచ్చారు.  తీరా సభ ముగిసిన తరువాత చీరలు పంపిణీ చేయకపోవటంతో నిరాశతో వెనుదిరిగారు. సభ నేపథ్యంలో నడికుడి రైల్వే స్టేషన్‌ రోడ్డు మూసివేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top