మాజీ ఎంపీ శివప్రసాద్‌ కన్నుమూత

TDP Leader Shivaprasad Passed Away - Sakshi

తిరుపతి అర్బన్‌/తిరుపతి కల్చరల్‌/సాక్షి, చెన్నై/ సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ, సినీ నటుడు నారమల్లి శివప్రసాద్‌ (68) శనివారం మధ్యాహ్నం 2.07 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సమస్యతోపాటు వెన్నునొప్పితో బాధ పడుతున్నారు. తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న శివప్రసాద్‌ను మెరుగైన వైద్యం కోసం ఈ నెల 12వ తేదీన చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయన మృతిచెందారు. శివప్రసాద్‌ భౌతిక కాయాన్ని చెన్నై నుంచి తిరుపతిలోని హరేరామ్‌ హరేకృష్ణ రోడ్డు ఎన్‌జీవో కాలనీలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. అభిమానుల సందర్శన నిమిత్తం ఆదివారం తెల్లవారుజాము వరకు అక్కడే ఉంచనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు శివప్రసాద్‌ స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పూటిపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శివప్రసాద్‌ మృతి తమను షాక్‌కు గురి చేసిందని ఆయన అల్లుడు నరసింహప్రసాద్‌ చెప్పారు.

వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి..
నారమల్లి శివప్రసాద్‌ 1951 జూలై 11న పూటిపల్లిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చెంగమ్మ, నాగయ్య. శివప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన తిరుపతిలోని ఎస్వీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ అ«భ్యసించారు. కొంతకాలం వైద్యుడిగా సేవలందించారు. అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999లో సత్యవేడులో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మూడేళ్ల పాటు సమాచార, సాంస్కృతిక శాఖల మంత్రిగా పనిచేశారు. 2009, 2014లో చిత్తూరు ఎంపీగా గెలిచారు. 2019లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెడ్డెప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. శివప్రసాద్‌ ఇద్దరు కుమార్తెలు వైద్యులే.

నిరసనల్లో ఆయనది ప్రత్యేక శైలి
సామాజిక చైతన్య కార్యక్రమాలంటే శివప్రసాద్‌కు ఎంతో ఇష్టం. ఆయన పేరు చెప్పగానే వెంటనే గుర్తుకొచ్చేది.. వివిధ సమస్యలపై తనదైన వేషధారణలతో చేపట్టిన నిరసనలే. ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ సమావేశాలప్పుడు రోజుకో వేషధారణతో నిరసన తెలిపారు. అందరి దృష్టిని ఆకర్షించారు. రాముడు, కృష్ణుడు, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, హిట్లర్, కరుణానిధి, మాంత్రికుడు తదితర చిత్రవిచిత్రమైన వేషాలతో నిరసన వినిపించారు.

ప్రోత్సహించిన వైఎస్సార్, భూమన
ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రోత్సాహంతో శివప్రసాద్‌ రాజకీయాల్లోకి వచ్చారు. భూమన స్థాపించిన వైఎస్సార్‌ యువసేనలో 1989–97 మధ్య కాలంలో శివప్రసాద్‌ చురుగ్గా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా శివప్రసాద్‌ను రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ వచ్చారు. 1996లో ఎంపీ టికెట్‌ ఇప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు.

సినీ రంగంలో తనదైన ముద్ర
‘అమ్మతోడు.. వాడు నన్ను కొట్టలే.. ఉత్తినే ప్రచారం చేసుకుంటున్నాడు’అంటూ ‘ఆటాడిస్తా’ సినిమాలో బోనాల శంకర్‌గా నవ్వులు పూయించిన శివప్రసాద్‌ని ప్రేక్షకులు అంత సులభంగా మరచిపోలేరు. ఆయన వెండితెరపై ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరించి, తనకంటూ గుర్తింపు పొందారు. పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే నాటకాలు వేశారు. 1980లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ‘కొత్త జీవితాలు’ సినిమాలో తొలిసారిగా నటించారు శివప్రసాద్‌. అప్పట్లో సినిమా అవకాశం రావడమే గొప్ప. అందుకే పారితోషికం అవసరం లేదని చెప్పారట. తర్వాత వసంత సేన్‌ దర్శకత్వం వహించిన ‘ఓ అమ్మ కథ’ చిత్రంలో నటించారు. చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఖైదీ’ సినిమాలో నటిస్తున్నప్పుడే ఒకేసారి 17 సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శివప్రసాద్‌.

కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను అలరించిన ఆయన 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘డేంజర్‌’ సినిమాలో విలన్‌ పాత్రకు నంది అవార్డు అందుకున్నారు. యముడికి మొగుడు, యమగోల మళ్లీ మొదలైంది, బాలు, జైచిరంజీవ, లక్ష్మి, కితకితలు, తులసి, ఒక్క మగాడు, బలాదూర్, ద్రోణ, మస్కా, పిల్ల జమీందార్, దూసుకెళ్తా వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ విడుదల కావాల్సి ఉంది. ఓ వైపు నటిస్తూనే మెగాఫోన్‌ పట్టిన శివప్రసాద్‌ ‘ప్రేమ తపస్సు, టోపీ రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరోకో’ సినిమాలకు దర్శకత్వం వహించారు. పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. శివప్రసాద్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

హీరోయిన్‌గా రోజాకు అవకాశం
శ్రీలత అనే అమ్మాయిని హీరోయిన్‌ రోజాగా మార్చింది శివప్రసాదే కావడం గమనార్హం. రాజేంద్రప్రసాద్‌ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన ‘ప్రేమ తపస్సు’ చిత్రంతో రోజాని హీరోయిన్‌గా పరిచయం చేశారు. శ్రీలతగా ఉన్న ఆమె పేరుని రోజాగా మార్చింది కూడా ఆయనే. ఆ తర్వాత రోజా ఎంత పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అయ్యారో అందరికీ తెలిసిందే. శివప్రసాద్‌ పదో తరగతిలోనే ‘పరువు కోసం’ అనే డ్రామాలో కామెడీ విలన్‌గా నటించారు. ఎస్వీ మెడికల్‌ కాలేజీకి ఓసారి తమిళ దర్శకుడు భారతీరాజా రావడంతో ఆయనతో ఏర్పడిన పరిచయం శివప్రసాద్‌ సినీ రంగ ప్రవేశానికి నాంది పలికింది.

సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం
మాజీ ఎంపీ శివప్రసాద్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. 

రాష్ట్రానికి తీరని లోటు: చంద్రబాబు
తన చిరకాల మిత్రుడు శివప్రసాద్‌ మరణం విచారకరమని ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ఆయన మృతి చిత్తూరు జిల్లాకే కాకుండా రాష్ట్రానికే తీరని లోటని పేర్కొన్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్‌ నేతలను (కోడెల శివప్రసాదరావు, ఎన్‌.శివప్రసాద్‌) కోల్పోవడం టీడీపీకి తీరని లోటన్నారు.

వ్యక్తిగతంగా నాకు తీరని లోటు: రోజా
సినీ, రాజకీయ రంగాలకు తనను పరిచయం చేసిన ఎన్‌.శివప్రసాద్‌ మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌కే రోజా ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రికి స్నేహితుడైన శివప్రసాద్‌ కుటుంబంతో తమకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఆయన లేని లోటు రాజకీయాల్లో, సినీరంగంలో, కుటుంబపరంగా కనిపిస్తోందన్నారు. కాగా, శివప్రసాద్‌ మృతి పట్ల చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప సంతాపం వ్యక్తం చేశారు. శివప్రసాద్‌ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. శివప్రసాద్‌ మృతి పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం రాజకీయ, కళారంగానికి తీరని లోటన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top