అధ్యాపకురాలిపై టీడీపీ నాయకుడి దాడి

TDP Leader Attack on Teacher in Chittoor - Sakshi

బండబూతులతో తిడుతూ కుటుంబ సభ్యులతో కలసి దాడి

తల్లిదండ్రులపై గొడవకు రావద్దనడమే ఆమె చేసిన తప్పు

పుట్టింటికి వచ్చిన ఆడపడచుకు అవమానం

పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

చిత్తూరు, ఎర్రావారిపాళెం: ఆవు తన పొలంలోకి వచ్చిందని ఓ టీడీపీ నాయకుడు తన కుటుంబ సభ్యులతో కలసి ఓ ప్రైవేటు మహిళా లెక్చరర్‌పై దాడికి పాల్పడ్డాడు. జుట్టు పట్టుకొని ఈడ్చి విచక్షణా రహితంగా కొట్టారు. అసభ్య పదజాలంతో దూషించారు. దుస్తులు చించారు. ఉన్నత విద్యావంతురాలైన మహిళా లెక్చరర్‌ అవమానంతో కన్నీరు మున్నీరైంది. టీడీపీ నాయకుడు, వారి కుటుంబ సభ్యులపై బాధితురాలు దీప ఎర్రావారిపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన మేరకు.. రేణిగుంట మండలం నిప్పమానుపట్టెడ గ్రామానికి చెందిన గురవయ్యతో రెండు సంవత్సరాల క్రితం ఎర్రావారిపాళెం మండలం నెరబైలు పంచాయతీ కొంగవారిపల్లెకు చెందిన దీపకు ప్రేమ వివాహం జరిగింది. దీప ఎంఎస్‌ఈ బీఈడీ చదువుకుంది. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ ఉండేది. రేణిగుంటకు చెందిన గురవయ్యను ప్రేమ వివాహం చేసుకుంది. అమ్మగారి ఇంటికి  వచ్చి కొంత కాలంగా ఇక్కడ ఉంటోంది.

విచక్షణా రహితంగా దాడి..
బీడు భూమిలోకి బాధితురాలి తల్లిదండ్రులు మేపుకొంటున్న ఆవు పొరపాటున వెళ్లింది. అదే గ్రామానికి చెందిన కేశవులునాయుడు పాత గొడవలు మనసులో ఉంచుకొని మంగళవారం ఉదయం 9.30 గంటలకు రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డాడు. కేశవులు, ధనుంజయులు, మునెమ్మ, పావని, కళావతి, మీనా బాధితురాలు ఇంటి దగ్గరకు వచ్చి ఆమె తల్లిదండ్రులపై పరుష పదజాలం తో దూషిస్తూ దాడికి యత్నించారు. తల్లిదండ్రులపై దాడి చేయవద్దంటూ కేశవులునాయుడును దీప ప్రాధేయపడింది. కేశవులునాయుడుతోపాటు అతని కుటుంబ సభ్యులు కలసి కులాంతర వివాహం చేసుకున్నదని, ఆ కులం పేరుతో తీవ్ర అవమానకరంగా దుర్భాషలాడారు. విచక్షణా రహితంగా కొట్టారు. ఆమె తమ్ముడు సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తుండగా అతన్ని కూడా తీవ్రంగా కొట్టారు. చంటి పిల్లాడని కనికరం లేకుం డా దీప ఎనిమిది నెలల కొడుకును కింద పడేశారు. చుట్టుపక్కల వారు వస్తుండడంతో వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం బాధితురాలు తల్లిదండ్రులతో కలసి ఎర్రావారిపాళెం పోలీసు స్టేషన్‌కు చేరుకొని ఎస్‌ఐ కృష్ణయ్యకు జరిగిన విషయం వివరించి న్యాయం చేయాలని కోరుతూ కన్నీటి పర్యంతమైంది. సెల్‌ఫోన్‌లో దాడికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉండడంతో 447, 354, 509, 323, రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top