స‘పోర్టు’ పేరిట దగా...

TDP government Made Life Turbulent For Fisher mens - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : సువిశాల భావనపాడు తీరంలో చేపల వేట సాగిస్తూ ప్రశాంత జీవితం గడుపుతున్న మత్స్యకారులు, పుడమితల్లినే నమ్ముకుని బతుకుతున్న రైతుల్లో పోర్టు పేరుతో టీడీపీ ప్రభుత్వం వారి జీవితాలను అల్లకల్లోలం  చేసింది. మంత్రి అచ్చెన్నాయుడు నాడు ఒక్క ఇటుక కూడా కదలదని చెప్పి తరువాత జరిగిన ‘జన్మభూమి మాఊరు’ కార్యక్రమంలో గ్రామాన్నే ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పడంతో మంత్రి ద్వంద్వ వైఖరిపై మత్స్యకారులు, రైతులు మండిపడుతున్నారు.

భావనపాడు పోర్టు నిర్మాణానికి 2015వ సంవత్సరంలో సుమారు 4800 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మండలంలోని భావనపాడు, మర్రిపాడు పంచాయతీలు, వజ్రపుకొత్తూరు మండలంలోని దేవునల్తాడ, కొత్తపేట, సైనూరు పంచాయతీల్లో భూములు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీనిపై అప్పట్లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు రావడంతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొంతమంది మత్స్యకారులు హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో ప్రభుత్వం కొంతకాలం మౌనంగా ఉండి చాప కింద నీరులా నయానో భయానో సొంత పార్టీ నేతలకు పరిహారం ఆశ చూపి తమకు అనుకూలంగా మలుచుకుంది. భూసేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చి నాలుగేళ్లు కావస్తుండడంతో  ఈ ప్రాంత రైతులు వారి భూములపై హక్కులు కోల్పోయారు. భూములపై క్రయవిక్రయాలు చేసుకునేందుకు వారికి అవకాశం లేకుండా పోయింది. దీని వల్ల ఇళ్లలో శుభకార్యాలు, విద్య, ఉద్యోగావసరాల కోసం భూములను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మరోవైపు ‘జన్మభూమి మాఊరు’ కార్యక్రమంలో  ఎకరాకు రూ.12 లక్షల 50 వేలు మాత్రమే ప్రభుత్వం పరిహారం ఇస్తుందని అప్పటి ఆర్డీవో వెంకటేశ్వరరావు మంత్రి అచ్చెన్నాయుడు సాక్షిగా చెప్పడంతో రైతుల్లో ఆందోళన తీవ్రమైంది. బయట మార్కెట్లో ఎకరా భూమి ధర రూ.20లక్షల నుంచి రూ.25 లక్షలు పలుకుతుంటే ఇలాగేనా పరిహారం చెల్లింపు అంటూ సభలో రైతులు నిరసన తెలియజేశారు. యువతకు ప్యాకేజీ అంటూ మభ్యపెట్టి కాలయాపన చేసి మాయచేశారు.

ఒకప్పుడు ఒక్క ఇటుక కూడా గ్రామం నుంచి కదలనీయబోనని చెప్పి ఆ తర్వాత గ్రామాన్నే ఖాళీ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడంతో మత్స్యకారులు, రైతుల్లో ఆగ్రహ జ్వాలలు  రగులుతున్నాయి. ఇటీవల కొత్త భూసేకరణ నోటిఫికేషన్‌ సుమారు 18 ఎకరాలకు ఇచ్చినా రైతులకు భూమిపై హక్కులేకుండా పోయింది. ఇలా రైతులు, మత్స్యకారులను పోర్టుపేరుతో దగా చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడుకు బుద్ధి చెప్పేందుకు ఆ ప్రాంతీయులు సిద్ధంగా ఉన్నారు. 

జీవో రద్దు చేయాలి 
ప్రభుత్వం విడుదల చేసిన పోర్టు భూసేకరణకు సంబంధించిన జీవోను రద్దు చేయాలి. నాలుగేళ్లుగా రైతులు భూములపై హక్కులు కోల్పోయి అవసరాలకు అమ్ముకోలేక ఇబ్బందులు పడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు ఒక్క ఇటుక కూడా కదలనీయనని చెప్పి ఇప్పుడేమో గ్రామాన్నే ఖాళీ చేయాలని అంటున్నారు.  ఇదేనా రాజకీయం.
–బి.మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్, భావనపాడు   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top