దివ్యాంగులపై టీడీపీ సర్కార్‌ చిన్నచూపు | The TDP government ignored the welfare of the damages | Sakshi
Sakshi News home page

దివ్యాంగులపై టీడీపీ సర్కార్‌ చిన్నచూపు

Feb 7 2019 5:57 AM | Updated on Feb 7 2019 5:57 AM

The TDP government ignored the welfare of the damages - Sakshi

సాక్షి, గుంటూరు: దివ్యాంగుల సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం విస్మరించింది. నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం చంద్రబాబు బూటకపు హామీలు ఇచ్చి వారిని నిలువునా దగా చేశారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది దివ్యాంగుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన టీడీపీ సర్కార్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రూ.3 వేల పింఛన్‌లు, రెండు చేతులు లేని వారికి నెలకు రూ.10 వేలు అంటూ మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని దివ్యాంగులు, ఆ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. స్వయంగా సీఎం చంద్రబాబు వివిధ సందర్భాల్లో అనేక హామీలు ఇచ్చి ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం చివరి బడ్జెట్‌లోనూ తమపై కరుణ చూపలేదని ఆవేదన చెందుతున్నారు.

పత్తా లేని డిజేబుల్డ్‌ హోమ్‌లు
80 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు 2500 మోటారు, బ్యాటరీ వాహనాలు పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించి రెండేళ్లయినా పట్టించుకోలేదు. దీంతో గతేడాది దివ్యాంగుల దినోత్సవాన్ని బ్లాక్‌ డేగా పాటిస్తామని దివ్యాంగుల జేఏసీ నాయకులు హెచ్చరించడంతో గత డిసెంబర్‌ 3న ప్రకటించిన విధంగా 2500 వాహనాలు కాకుండా అరకొర పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో డిజేబుల్డ్‌ హోమ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఒక్కటి కూడా నిర్మించలేదు. వారంలోగా దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్‌లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు దాన్ని గాలికొదిలేశారు.

దివ్యాంగులు.. సర్టిఫికెట్‌ల కోసం మీసేవా కార్యాలయాలు, సదరం క్యాంప్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఇటీవల రెండు చేతులు లేని వారికి నెలకు రూ.10 వేలు ఇస్తామని సీఎం చెప్పడంతో ఈ మాటలు నమ్మి పింఛన్‌ కోసం వెళ్లినవారికి కేవలం రూ.3 వేలు, మరికొంతమందికి రూ.4,500 మాత్రమే ఇచ్చారు. ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ హామీని కూడా నెరవేర్చలేదని దివ్యాంగ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. 

దివ్యాంగుల అవస్థలు పట్టించుకోవడం లేదు
వైకల్య శాతంతో సంబంధం లేకుండా పింఛన్‌ను మంజూరు చేయాలి. పర్సంటేజీల పేరుతో పింఛన్‌లో కోత పెట్టడం సమంజసం కాదు. వారంలోగా సదరం సర్టిఫికెట్‌లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు సర్టిఫికెట్‌ల కోసం నెలల తరబడి దివ్యాంగులు అవస్థలు పడుతున్నా పట్టించుకోవడం లేదు.  – గుణశేఖర్, 
దివ్యాంగ జేఏసీ రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు

రూ. 4,500లే ఇచ్చారు
చంద్రబాబు రెండు చేతులు లేని వారికి ఫిబ్రవరిలో రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. తీరా పింఛన్‌ తీసుకోవడానికి వెళ్తే రూ.4,500 మాత్రమే ఇచ్చారు. 
– నాగేంద్ర, దివ్యాంగుడు, 
పశ్చిమ గోదావరి జిల్లా

సీఎం, మంత్రులు ఇచ్చిన వాగ్దానాలు ఇలా..
2014, డిసెంబర్‌లో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఇచ్చిన హామీలు..
►ఏటా బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయిస్తాం.
►అన్ని జిల్లాల్లో హోమ్‌లు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం
►రిజర్వేషన్లు పెంచుతాం.

2015, 2016 డిసెంబర్‌ 3న, విజయవాడలో..
►విజయవాడలో స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేస్తాం.
►గుంటూరులో 2.70 కోట్లతో బ్రెయిలీ ప్రెస్‌ ఏర్పాటు.
►రూ.20 కోట్లు ఖర్చు చేసి బాల్యంలో అంగవైకల్యం, అనారోగ్య సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం.
►ఏటా బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తాం.
►2500 మందికి మోటారు, బ్యాటరీ వాహనాలు.
►సదరం సర్టిఫికెట్‌లు వారంలోగా మంజూరు.

2017, డిసెంబర్‌ 3న కర్నూలులో..
►ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
►కర్నూలు జిల్లాలో రూ.6.94 కోట్లతో సెన్సార్‌ పార్క్‌ నిర్మిస్తాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement