
పెళ్లికి తొందరేంటన్నాడు... తొందరగా వెళ్లిపోయాడు
కుటుంబ సభ్యులతో గడపడానికి ఐదు రోజుల సెలవుపై గత నెల స్వగ్రామానికి వచ్చాడు. పెళ్లి చేసుకోరా నాయనా అంటే అప్పుడే తొందరేమొచ్చింది. వచ్చే ఏడాది చూద్దాంలే అన్నాడు.
సరుబుజ్జిలి: కుటుంబ సభ్యులతో గడపడానికి ఐదు రోజుల సెలవుపై గత నెల స్వగ్రామానికి వచ్చాడు. పెళ్లి చేసుకోరా నాయనా అంటే అప్పుడే తొందరేమొచ్చింది. వచ్చే ఏడాది చూద్దాంలే అన్నాడు. త్వరలోనే సెలవుపై మళ్లీ వస్తానని గత నెల 26వ తేదీన విధి నిర్వహణకు వెళ్లాడు. కానీ అదే ఆఖరి చూపవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. స్వశక్తితో పైకి వచ్చిన పెద్దకుమారుడు తమను ఆదుకుంటాడని భావిస్తే విధి నిర్వహణలో దుండగుల చేతిలో హతమారాడని తెలిసి వారు గుండలవిసేలా విలపిస్తున్నారు. ఇదీ రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట సమీపంలోని శుక్రవారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు దొంగనోట్ల ముఠాకు మధ్య జరిగిన కాల్పులు, కత్తిపోట్ల సంఘటనలో మృత్యువాతపడిన ఏఆర్ కానిస్టేబుల్ తాడేలు ఈశ్వరరావు(29) కుటుంబం పరిస్థితి. వివరాల్లోకి వెళితే...
సరుబుజ్జిలి మండలం షలంత్రికి చెందిన ఈశ్వరరావు కుటుంబం కాయకష్టం మీదే ఆధారపడింది. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. స్వశక్తితో ఎదిగిన ఆయన 2011లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరగా టాస్క్‌ఫోర్స్ దళానికి కేటాయించారు. ఈశ్వరరావుకు తల్లిదండ్రులు మల్లేశ్వరరావు, తవిటమ్మ, సోదరుడు రమణ, సోదరి ఉన్నారు. గ్రామీణ నేపథ్యమైనప్పటికీ రక్షణ దళంలో చేరాలన్న పట్టుదలతో కానిస్టేబుల్‌గా ఎన్నికయ్యాడు. అందరితో సరదగా ఉండే ఈశ్వరరావు గత నెల సెలవులో వచ్చి 26న డ్యూటీకి వెళ్లాడు. అదే ఆఖరి చూపవుతుందని ఊహించలేదని తండ్రి మల్లేశ్వరరావు రోదిస్తూ చెప్పారు. ఈశ్వరరావు మృతి చెందిన సమాచారం తెలిసి షలంత్రి గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
ఈశ్వర్ మృతిపట్ల చంద్రబాబు విచారం
దొంగనోట్ల ముఠా జరిపిన దాడిలో కానిస్టేబుల్ ఈశ్వర్ మృతి చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈశ్వర్ కుటుంబానికి సంతాపం ప్రకటించారు. కాగా, ఈశ్వరరావు మృత దేహాన్ని ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక హెలికాప్టర్‌లో శనివారం రాత్రి తీసుకువచ్చారు.