
సాక్షి, అమరావతి : ప్రజావేదికకు సంబంధించి సోషల్ మీడియాలో తన పేరుతో సర్క్యులేట్ అవుతోన్న వార్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ స్పందించారు. కృష్ణా నది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ నివాసం సమీపంలో నిర్మించిన ప్రజావేదికపై తానుగానీ, వైఎస్సార్‌సీపీ నుంచి గానీ ఎలాంటి లేఖలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని ఇదివరకే ప్రకటించానని పేర్కొన్నారు.
కానీ, ఇంకా ఈ అంశంపై మీడియాలో వస్తున్న కథనాలను చూసి మరోసారి స్పష్టం చేయదలచుకున్నానని ఓ ప్రకటనలో పునరుద్ఘాటించారు. మీడియా మిత్రులు ఈ విషయాన్ని గమనించగలరని కోరారు.