గీత రాత మారింది

sweden Woman Adopted 18months child Geetha  - Sakshi

ఒంగోలుకు చెందిన 18 నెలల చిన్నారిని దత్తత తీసుకున్న స్వీడన్‌ యువతి

కలెక్టర్‌ సమక్షంలో చిన్నారి అప్పగింత

ఒంగోలు టౌన్‌: ఆ ఆడ శిశువు జన్మించిన తరువాత రెండు నెలలే తల్లి పొత్తిళ్లలో ఉంది. ఆ మాతృమూర్తి కన్న పేగును దారుణంగా తెంచేసుకుంది. రెండు నెలల పసిగుడ్డును నిర్ధాక్షిణ్యంగా వదిలేసింది. మహిళా శిశు సంక్షేమశాఖ పర్యవేక్షణలో ఆ శిశువు ఒంగోలులోని శారా హోమ్‌లో ఉంటోంది. ఆ శిశువుకు గీత అని పేరు పెట్టారు. ఒకటిన్నరేళ్ల వయస్సు(18నెలలు) కలిగిన గీత చలాకీగా ఆడుకుంటూ ఉంటోంది. అయితే ప్రస్తుతం గీత తలరాత ఒక్కసారిగా మారిపోయింది. ప్రత్యేక అవసరాలు కలిగిన ఆ చిన్నారిని స్వీడన్‌ దేశానికి చెందిన యువతి కరీనా జూలియన్‌ మంగళవారం దత్తత తీసుకుంది.

కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ సమక్షంలో స్వీడన్‌ యువతి గీతను దత్తత కింద స్వీకరించింది. ఈ సందర్భంగా కరీనా జూలియన్‌ మాట్లాడుతూ స్వీడన్‌లో ఉద్యోగం చేస్తున్న తాను ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భారతదేశంలోని రెండేళ్లలోపు వయస్సు కలిగిన శిశువును తీసుకునేందుకు తాను దరఖాస్తు చేసుకున్నానన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ సమగ్ర బాలల పరిరక్షణ పథకం దత్తత విభాగం ద్వారా స్వీడన్‌ యువతికి గీతను దత్తత ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ పీ సరోజిని, ఐసీపీఎస్‌ డీసీపీఓ ఎన్‌ జ్యోతిసుప్రియ, ప్రత్యేక దత్తత విభాగం మేనేజర్‌ శ్రీలత, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి హీనాప్రతిభ ఉన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top