వర్మా.. ఇదేం ఖర్మ!

SVSN Varma Insult Sanitation Inspector In East Godavari - Sakshi

తూర్పుగోదావరి, గొల్లప్రోలు : మొదటి చిత్రంలో ఉత్త చేతులతో మురుగు కాలువలోని పూడిక తీస్తున్న మహిళ ఎవరో తెలుసా... శానిటరీ ఇన్‌స్పెక్టర్‌...ఆ పక్కన నిలబడి పెత్తనం చెలాయిస్తున్నది పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ. పూడిక పేరుకుపోతే పారిశుద్ధ్య కార్మికులను పిలిపించి ఆ పనులు చేపట్టించాలి గానీ ఇదేమి దౌర్జన్యం...అందరూ చూస్తుండగానే మురుగులో చేతులు పెట్టించి తీయించడం... అదీ ఓ మహిళా ఉద్యోగిపట్ల ఇంత అమానుషమా అని అక్కడున్నవారు ముక్కునవేలేసుకున్నారు.

రెండో చిత్రం చూశారు కదా...మురుగు కాలువలో దిగి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పని చేస్తున్నది ఎవరో తెలుసా... ఆ ఇంకెవరు మున్సిపల్‌ కార్మికుడై ఉంటారనుకుంటే బురదలో కాలేసినట్టే...మన పక్క రాష్ట్రమైన పుదుచ్చేరి రాష్ట్ర విద్యాశాఖామంత్రి కమలకన్నన్‌. నిరసనగా ఇలా చేశారంటే కానేకాదు ... పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించి ‘నేను సైతం’ అంటూ శ్రమదానంగా ఇలా పనిలోకి దిగారు. ఆ మంత్రి పనిలో పెత్తనం లేదు...అహంకారం అంతకన్నా లేదు...ఆత్మీయత కనిపిస్తోంది. మరి ఇక్కడ ఇంత అరాచకమేమిటని పంచాయతీ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.

గొల్లప్రోలు పట్టణం 9, 10 వార్డుల్లో టీడీపీ గ్రామదర్శిని కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్యటిస్తున్న సమయంలో పదో వార్డులో పాత పోలీస్‌ స్టేషన్‌ వీధిలోని మహిళలు పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందంటూ ఫిర్యాదు చేశారు. ఆ పక్కనే ఉన్న శానిటరీ ఇన్‌స్పెక్టరు శివలక్ష్మిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. సత్వరమే శుభ్ర పరచాలని ఆదేశించడంలోనూ తప్పులేదు. కానీ అక్కడున్న జనం మెప్పు కోసం మహిళా అధికారి అని కూడా చూడకుండా చేతులతో మురికిని తీయాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆమె చేసేది లేక టీడీపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు చూస్తుండగా అవమాన భారంతో కాలువలో మురికిని చేతులతో తొలగించారు. ఎమ్మెల్యే వైఖరిపై పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top