సా...గుతున్న సర్వే..! | Survey incomplete enjayment | Sakshi
Sakshi News home page

సా...గుతున్న సర్వే..!

Aug 7 2015 1:38 AM | Updated on Oct 1 2018 2:00 PM

సా...గుతున్న సర్వే..! - Sakshi

సా...గుతున్న సర్వే..!

మండలంలోని పలు గ్రామాల్లో వేల మంది రైతులు వారి పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను సాగుచేసుకుంటున్నారు...

ఒకరుకాదు..ఇద్దరు కాదు. రెండువేల మంది అన్నదాతలు. రెండున్నరేళ్లుగా అష్టకష్టాలు. తాతముత్తాతల నుంచి సాగుచేసుకుంటున్న భూములపై రెవెన్యూ శాఖాధికారులు చేపట్టిన ఎంజాయ్‌మెంట్ సర్వే పూర్తికాకపోవడంతో వెతలు. అడంగల్, 1బీలు నిలిచిపోవడంతో బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అందక అవస్థలు. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా స్పందించని అధికారులు. కొమరోలు మండలం దద్దవాడ, రెడ్డిచెర్ల గ్రామాల్లో అన్నదాతల ఆక్రందనలు...    
 
- కొమరోలు మండలం దద్దవాడ, రెడ్డిచెర్ల గ్రామాల్లో రెండున్నరేళ్లుగా పూర్తికాని ఎంజాయ్‌మెంట్ సర్వే
- రెండు వేల మంది రైతులకు నిలిచిపోయిన అడంగల్, 1బీలు
- బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అందక అవస్థలు
- ఆగిపోయిన భూముల కొనుగోలు, అమ్మకాలు
- రైతులు మొరపెట్టుకుంటున్నా..పట్టించుకోని అధికారులు
కొమరోలు :
మండలంలోని పలు గ్రామాల్లో వేల మంది రైతులు వారి పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను సాగుచేసుకుంటున్నారు. కొంతకాలంగా భూముల కంప్యూటరీకరణ చేపట్టిన నేపథ్యంలో ఆయా భూములకు సంబంధించి రికార్డుల్లో ఒకరిపేరు, పట్టాదారు పాస్‌పుస్తకాల్లో మరొకరిపేరు, భూముల్లో ఇంకొకరు ఉండటంతో రెవెన్యూ అధికారులకు ఆయా భూములకు సంబంధించి 2013 జనవరి 14వ తేదీ ఎంజాయ్‌మెంట్ సర్వే చేపట్టింది. కొమరోలుతో పాటు గిద్దలూరు, రాచర్ల, అర్ధవీడు మండలాల్లోని కొన్ని రెవెన్యూ గ్రామాల్లో ఎంజాయ్‌మెంట్ సర్వే చేపట్టారు.

కొమరోలు మండలంలోని దద్దవాడ, రెడ్డిచెర్ల గ్రామాల్లో మినహా మిగిలిన మండలాలు, గ్రామాల్లో భూముల విస్తీర్ణం తక్కువగా ఉండటంతో సర్వే పూర్తయింది. దద్దవాడ, రెడ్డిచెర్ల రెవెన్యూ పరిధిలోని 21 గ్రామాల్లో 2760 సర్వే నంబర్లలో సర్వే నేటికీ పూర్తికాకపోవడంతో సుమారు 2 వేల మంది రైతులకు అడంగల్, 1బీలు నిలిచిపోయాయి. వాటిపై ఆధారపడిన రాయితీలు, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు రైతులకు దూరమయ్యాయి. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణం మీదకు వచ్చి తమ భూములను అమ్ముకోవాలన్నా అడంగల్, 1బీలు లేని కారణంగా కొనేవారు కనిపించక ఆవేదన చెందుతున్నారు.
 
11,720 ఎకరాలు, 1,925 మంది రైతులు...
దద్దవాడ రెవెన్యూ పరిధిలోని 910 సర్వే నంబర్లకుగానూ 3,320 ఎకరాల విస్తీర్ణంలో 725 మంది రైతులున్నారు. రెడ్డిచెర్ల రెవెన్యూ పరిధిలో 1850 సర్వే నంబర్లకుగానూ 8,400 ఎకరాల విస్తీర్ణంలో 1,200 మంది రైతులున్నారు. వీటికి సంబంధించి ఎంజాయ్‌మెంట్ సర్వే చేసేందుకు రెండు టీంలు ఏర్పాటు చేశారు. మార్కాపురం ఆర్‌డీఓ రాఘవరావు 2013 జనవరి 14వ తేదీ సర్వే ప్రారంభించారు. దద్దవాడలో 200 సర్వే నంబర్లలో, రెడ్డిచెర్లలో 50 సర్వే నంబర్లలో మాత్రమే ఇప్పటి వరకూ సర్వే పూర్తిచేశారు. ఇంతలో సర్వే బృందాల్లోని వారికి పదోన్నతులు రావడం, వారి స్థానాల్లో కొత్తవారిని నియమించడంతో సర్వే పూర్తిగా ఆగిపోయింది. అడంగల్, 1బీల జారీ కూడా నిలిచిపోయింది. అవి లేకపోవడంతో బ్యాంకు రుణాలు కూడా అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కలెక్టర్ స్పందించి సర్వేపై ప్రత్యేక దృష్టిసారించి పూర్తిచేయించాలని రైతులు కోరుతున్నారు.
 
సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ వైవీ...

ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దద్దవాడ గ్రామాన్ని దత్తత తీసుకున్న నేపథ్యంలో రైతుల భూములకు చేపట్టిన సర్వే పూర్తిచేయించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ అధికారులకు రైతులు సమస్యను వివరించినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. ఆ సమస్యను పరిష్కరిస్తామని ఎంపీకి కలెక్టర్ హామీ ఇచ్చారు.
 
ఇదీ..అసలు సమస్య...
గతంలో గ్రామాలను పరిపాలించే కరణాలు వారిష్టారాజ్యంగా వ్యవహరించి ఒకే సర్వే నంబర్‌ను ఇద్దరుముగ్గురు రైతులకు వేసి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇప్పించారు. ప్రస్తుతం భూములను ఆన్‌లైన్ చేస్తుండటంతో ఆ లోపాలన్నీ వెలుగుచూశాయి. ఆ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఒకరి పేరు, పాస్‌పుస్తకాల్లో మరొకరి పేరు ఉండగా, భూమిని ఇంకొకరు సాగుచేసుకుంటున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు ఆ భూములను ఎవరిపేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎంజాయ్‌మెంట్ సర్వే చేపట్టారు.

ఏయే భూములు ఎవరికి చెందినవో తేల్చేందుకు ఈ సర్వే చేపట్టారు. అప్పటి తహశీల్దార్ పి.చంద్రశేఖరరాజు అప్పటి కలెక్టర్ కాంతిలాల్‌దండే దృష్టికి సమస్యను తీసుకెళ్లగా, కొమరోలు మండలంలోని రెడ్డిచెర్ల, దద్దవాడ రెవెన్యూ గ్రామాలతో పాటు గిద్దలూరు, రాచర్ల, అర్ధవీడు మండలాల్లోని మరికొన్ని రెవెన్యూ గ్రామాల్లో సర్వే ప్రారంభించారు. పాత సర్వే నంబర్లను రద్దుచేసి పట్టాదారు పాస్‌పుస్తకంలోని విస్తీర్ణానికి, భూమ్మీద ఉన్న విస్తీర్ణాన్ని సరిపోల్చి సరిహద్దులు ఏర్పాటు చేయాలని ఆర్డీవో ఆదేశించారు. అయితే, మిగిలిన మండలాల్లో తక్కువ సర్వే నంబర్లు ఉండటంతో సర్వే పూర్తయింది. అదే సమయంలో సర్వేయర్ల నియామకాలు, పదోన్నతులు జరగడంతో సిబ్బంది తారుమారవడం, ఎక్కువ సర్వే నంబర్లు, విస్తీర్ణం ఉండటంతో రెడ్డిచెర్ల, దద్దవాడ రెవెన్యూ గ్రామాల్లో ఎంజాయ్‌మెంట్ సర్వే మొదట్లోనే నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement