ఏళ్లనాటి కల ఫలించిన వేళ

Suburban Villages Became Panchayats - Sakshi

పంచాయతీలుగా  శివారు గ్రామాలు 

కష్టాలు తప్పుతాయంటున్న గిరిజనులు 

అభివృద్ధికి బాటలు పడతాయని ఆశాభావం

రావికమతం(చోడవరం): ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని శివారు గిరిజన గ్రామాలవి. ఏ చిన్న పని కావాలన్నా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచాయతీ కేంద్రానికి వెళ్లాల్సిందే. 20 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి. మా పరిస్థితిని పట్టించుకోండి.. అంటూ ఎన్నో మార్లు వినతులు.. విజ్ఞప్తులు.. విసిగి పోయి ధర్నాలు కూడా చేశారు ఆయా గ్రామాల ప్రజలు. అయినా నేతలు, అధికారుల్లో మార్పు రాలేదు. హామీలు నీటిమీద రాతలుగానే మిగిలాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నూతన పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు కూడా ప్రకటించడంతో తమ కష్టాలు తీరనున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

మండలంలో...
రావికమతం మండలంలో గ్రామ పంచాయతీలు 24 
24 పంచాయతీల పరిధిలో శివారు గ్రామాలు 62 
పంచాయతీ కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్ని పంచాయతీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 
ప్రస్తుతం మండలంలో పంచాయతీల సంఖ్య 28కి చేరింది.     

వమ్మవరం:  కన్నంపేట పంచాయతీ శివారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వమ్మవరం గ్రామం పంచాయతీగా ఏర్పాటైంది.  
జనాభా: 969, ఓటర్లు: 713  
రిజర్వేషన్‌: జనరల్‌

కె.కొట్నాబిల్లి: టి.అర్జాపురం పంచాయతీ శివారు ఐదు గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో కె.కొటా్నబిల్లి, గదబపాలెం, డోలవానిపాలెం గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు.   
జనాభా: 766, ఓటర్లు: 593  
రిజర్వేషన్‌: ఎస్టీ మహిళ

కేబీపీ అగ్రహారం: కొమిర పంచాయతీ శివారు 4 కిలోమీటర్ల పైగా దూరంలో ఉన్న కేబీపీ ఆగ్రహారం గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఆ పంచాయతీలో యర్రబంద గ్రామాన్ని కలిపారు.  
జనాభా: 991 ఓటర్లు: 634  
రిజర్వేషన్‌: జనరల్‌ మహిళ 

ధర్మవరం: పి.ధమ్రవరం, కె.ధర్మవరం గ్రామాలు జెడ్‌.కొత్తపట్నం పంచాయతీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఏ పని కావాలన్నా సర్పానది దాటి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ రెండు గ్రామాల్ని కలిపి ధర్మవరం పంచాయతీగా ఏర్పాటు చేశారు.  
జనాభా: 429, ఓటర్లు: 327  
రిజర్వేషన్‌: జనరల్‌ మహిళ 

సమస్య తీరింది 
టి.అర్జాపురం శివారుగా మా ఐదు గిరిజన గ్రామాలుండేవి. ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు సరిగ్గా వినియోగించక మా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు ఆ సమస్య లేదు. 
–గొలుముల రాములు, కె. కొట్నాబిల్లి

ఆనందంగా ఉంది
మాది కన్నంపేట శివారు వమ్మవరం గ్రామం. ఇన్నాళ్లూ అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. సర్పంచ్‌ ఎన్నికకు సిద్ధమవ్వడం ఆనందంగా ఉంది. మా కష్టాలు తీరినట్టే.   
– గల్లా వెంకటలక్ష్మి, వమ్మవరం

నది దాటక్కర్లేదు 
మాది ధర్మవరం. జెడ్‌.కొత్తపట్నం శివారుగా ఉండేది. పంచాయతీ కేంద్రానికి వెళ్లాలంటే సర్పానది దాటాల్సి వచ్చేది. భయం భయంగా వెళ్లేవాళ్లం. ఇకపై ఆ ఇబ్బంది లేదు. 
– గోరా చిరంజీవి, ధర్మవరం
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top