విశాఖలో సబ్‌ మెరైన్‌ హెరిటేజ్‌ మ్యూజియం

Submarine Heritage Museum in Visakhapatnam - Sakshi

  కృష్ణానదిపై వైకుంఠపురం, చోడవరం వరకూ వాటర్‌ఫ్రంట్‌ 

  టూరిజం ప్రమోషన్‌ బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో సబ్‌ మెరైన్‌ హెరిటేజ్‌ మ్యూజియం ఏర్పాటుకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం టూరిజం ప్రమోషన్‌ బోర్డు సమావేశంలో పలు ప్రాజెక్టులపై పర్యాటక శాఖ అధికారులతో ఆయన చర్చించారు. పారిస్‌కు ఈఫిల్‌ టవర్, ఆగ్రాకు తాజ్‌ మహల్‌ లాగా, విశాఖకు సబ్‌ మెరైన్‌ మ్యూజియం ప్రత్యేక ఆకర్షణ కావాలన్నారు. విజయనగరం జిల్లా చింతపల్లి వద్ద స్కూబా డైవింగ్, విశాఖ, విజయనగరం జిల్లాలలో స్కై స్కూల్‌ కార్యకలాపాలను ప్రోత్సహించాలన్నారు. ప్రకాశం బ్యారేజి ఎగువన వైకుంఠపురం, దిగువన చోడవరం ప్రాజెక్టులు పూర్తయితే రాజధాని ప్రాంతంలో కృష్ణానది వాటర్‌ ఫ్రంట్‌గా ఉంటుందన్నారు.

అదే తరహాలో ఉత్తరాంధ్రలో పురుషోత్తపట్నం ప్రాజెక్టు నుంచి 50 కిలోమీటర్ల వాటర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలని చెప్పారు. గ్రామ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని, స్థానిక జానపదాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామ దర్శని, నగర దర్శనిలో రాబోయే 5 నెలల్లో 774 కళాకారుల బృందాలకు వర్క్‌షాపులు నిర్వహించాలని  ఆదేశించారు.ఈ సమావేశంలో మంత్రి అఖిలప్రియ  పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల వినియోగానికి త్వరలో ఒక విధానాన్ని తీసుకు వస్తామని సీఎం చెప్పారు. సచివాయంలో  శుక్రవారం విద్యుత్‌ వాహనాల వినియోయాగంపై సమీక్ష నిర్వహించారు. కాగా, రూ. కోటిన్నర విలువైన నిత్యావసర సరుకులతో కేరళకు బయలుదేరిన వాహనాలకు సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ ఆధ్వర్యంలో ఈ సరుకులు సేకరించి సచివాలయానికి తెచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top