సు‘బాబు’ల్‌ ‘మోసం’

Subabul And Jamail Farmers Protest And Demands For Support Price In Cheemakurthi - Sakshi

కర్ర కొనుగోళ్లలో రైతులకు తీవ్ర అన్యాయం

రాష్ట్రంలో సాగయ్యే కర్రలో 42 శాతం వాటా ఒక్క ప్రకాశం జిల్లా నుంచే

సాక్షి, చీమకుర్తి: ‘‘ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అమలు చేయాలని కలెక్టర్‌ను కలిశాం. మంత్రి దృష్టికి తీసుకుపోయాం. చివరకు జిల్లాకు వచ్చినప్పుడు ఒకసారి, రాజధానికే పోయి మరోసారి సీఎంకు కర్ర కొనుగోళ్లలో  జరుగుతున్న అన్యాయంపై మొరపెట్టుకున్నాం. పోరాటంతో ఐదేళ్లు గడిచిపోయాయి గానీ కర్రసాగు చేసే మా బాధలు మాత్రం పరిష్కారం కాలేదని’’ రైతులు వాపోతున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్, రైతు సంఘం నాయకులు వివిధ దశల్లో పోరాటాలు చేశారు తప్ప రైతుల కష్టానికి ఫలితం లేదు. జామాయిల్‌ కర్ర టన్నుకు రూ.4400, సుబాబుల్‌ కర్రకు రూ.4200 వంతున కొనుగోలు చేయాలని ప్రభుత్వమే జీఓ నంబరు 31 విడుదల చేసింది.

ఆ జీవో ప్రకారమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తుంటే పేపర్‌ మిల్లుల యజమానులు మార్కెట్‌ కమిటీలను తుంగలో తొక్కి ప్రత్యేకంగా దళారులను అడ్డం పెట్టుకొని జామాయిల్‌ టన్నును రూ.2500, సుబాబుల్‌ టన్నును రూ.2 వేలు వంతున కొంటూ రైతుల కష్టాన్ని దళారులు, పేపర్‌ మిల్లుల యాజమాన్యాలు దోచుకుంటున్నాయని రైతులు ఆరోపించారు. దళారులు అక్రమ మార్గంలో కొనుగోలు చేస్తున్న కర్ర లారీలను ఆపి రైతులందరికీ సమన్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

అయినా ప్రభుత్వం పట్టించుకోకపోగా దానిపై మంత్రివర్గ ఉపసంఘం కనీసం కన్నెత్తి కూడా చూడలేదనే విమర్శలు రైతుల్లో వ్యక్తమవుతోంది. పేపర్‌ మిల్లుల యజమానులు కొనుగోలు చేయకపోగా నిలదీశారనే నెపంతో సంతనూతలపాడు, చీమకుర్తి మండలాలకు చెందిన రైతుల కర్రను కక్ష పూరితంగా కొనుగోలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. 

రాష్ట్రంలో 42 శాతం వాటా ప్రకాశం జిల్లాదే: 
రాష్ట్రంలో సాగయ్యే జామాయిల్, సుబాబుల్‌లో 42 శాతం వాటా ఒక్క ప్రకాశం జిల్లా నుంచే సాగవుతుందని రైతుసంఘం నాయకుల గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. జిల్లాలో జామాయిల్‌ 1.07 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. సుబాబుల్‌ 60 వేల ఎకరాల్లో, సరుగుడు 8 వేల ఎకరాల్లో సాగవుతుందని రైతులు చెబుతున్నారు. గతంలో వర్షాలు పుష్కలంగా ఉన్నప్పుడు మూడు సంవత్సరాలకే పొలంలో కర్ర కోతకు వచ్చేది. నాలుగైదేళ్ల నుంచి సకాలంలో వర్షాలు లేక ఐదేళ్లయినా కర్ర కోతకు రాకపోగా ఒక్కో ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు.

ఇప్పటికే అనేక వేల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్‌ కర్రను కొనుగోలు చేసేవారు లేక కోతకు వచ్చిన కర్ర కూడా పొలాల్లోనే ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మార్కెట్‌లో పేపర్‌ ఖరీదు టన్నుకు రూ.15 వేలు పెరిగిందని, గతంతో పోల్చుకుంటే 50 శాతం పేపర్‌ ధర పెరగగా, దానికి ముడి సరుకుగా ఉన్న సుబాబుల్, జామాయిల్‌ కర్రకు మాత్రం ఐదేళ్ల క్రితం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వకపోగా దానిలో సగానికి సగం కోతపెట్టి సగం ధర మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top