
ప్రధాన పంటల ధరలన్నీ దారుణంగా పతనం
అరటి, చీనీ, టమాటా, ఉల్లి పంటలకు గడ్డు రోజులు
మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం
ఉల్లి క్వింటా రూ.1,200తో కొంటామని మాటిచ్చి తప్పుకున్న వైనం
ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులు
వర్షాభావంతో భారీగా తగ్గిన వేరుశనగ సాగు
దిక్కుతోచక రాయలసీమ రైతాంగం విలవిల
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో వ్యవసాయ రంగంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉల్లి, టమాటా, మామిడి, చీనీ, అరటి తదితర పంటలకు కనీస మద్దతు ధరలు దక్కక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటను కొనే వారు లేక నష్టాల బారిన పడుతున్నారు. మార్కెట్‌లో జోక్యం చేసుకొని ధరల పతనాన్ని అడ్డుకోవల్సిన రాష్ట్ర ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదన్నట్టుగా చేష్టలుడిగి చూస్తుండడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి అల్లాడిపోతున్నారు.
రాష్ట్రంలో ఉద్యాన పంటలు 45.75 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, రాయలసీమ జిల్లాల్లో 19.25 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 346 లక్షల టన్నుల దిగుబడులొస్తుండగా, అందులో సగానికి పైగా.. అంటే 221 లక్షల టన్నుల (63.9 శాతం) దిగుబడులు రాయలసీమ నుంచే వస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తిలో అగ్రస్థానం రాయలసీమదే. రాష్ట్ర వ్యాప్తంగా 213 లక్షల టన్నుల పండ్ల ఉత్పత్తి జరుగుతుండగా, అందులో 40 లక్షల టన్నుల అరటి, 22.35 లక్షల టన్నుల చీనీ (బత్తాయి) ఉత్పత్తి రాయలసీమ జిల్లాల నుంచే వస్తోంది.
మామిడి దిగుబడులు 49 లక్షల టన్నులు కాగా, దాంట్లో 15 లక్షల టన్నులు రాయలసీమ జిల్లాల నుంచే వస్తున్నాయి. రాష్ట్రంలో టమాటా ఉత్పత్తి 42.46 లక్షల టన్నులు కాగా, ఇందులో 41 లక్షల టన్నులు రాయలసీమ జిల్లాల నుంచే వస్తున్నాయి. ఉల్లి దిగుబడులు 10 లక్షల టన్నులు కాగా, దాంట్లో 7–8 లక్షల టన్నులు రాయలసీమ జిల్లాల నుంచే అందుతోంది.
ధరల పతనంతో గగ్గోలు
» గతేడాది కూడా రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగయ్యే డ్రాగన్ ఫ్రూట్‌తో పాటు బొప్పాయి, కర్బూజా, పుచ్చకాయ తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రనష్టాలు చవిచూశారు. ఈ ఏడాది జూలై, ఆగస్టులో «ధర లేక లక్షలాది మంది మామిడి రైతులు నష్టపోగా, తాజాగా ప్రస్తుత ఖరీఫ్‌లో సీజన్ ఆరంభంలోనే ఉల్లి, టమాటా, అరటి, చీనీ వంటి పంటల ధరల పతనంతో సీమ రైతులు విలవిల్లాడి పోతున్నారు.
» టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వక పోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ధర లేక కోతకొచ్చిన పంటను చేలల్లోనే వదిలేçస్తుండగా, కొనేవారు లేక రోడ్డుపక్కన పారబోయడం, మేకలు, గొర్రెల మేతకు పెడుతున్న ఘటనలు రోజూ సర్వసాధారణమయ్యాయి. ప్రస్తుతం రైతుల నుంచి క్వింటా ఉల్లి రూ.300 – రూ.400, టమాటా రూ.200– రూ.600కు మించి కొనడంలేదు.
» రాయలసీమలో పండే జీ–9 అరటి టన్ను రూ.4 వేల నుంచి రూ.6 వేలు, చీనీ (బత్తాయి) టన్ను రూ.6 వేల నుంచి రూ.12 వేలకు మించి ధర పలకడం లేదు. ఉల్లి క్వింటా రూ.1,200కు తక్కువ కాకుండా కొనుగోలు చేస్తామని నమ్మబలికిన ప్రభుత్వం.. వారం తిరక్కుండానే కొనుగోళ్లను నిలిపివేసింది. మార్కెట్–మద్దతు ధర మధ్య వ్యత్యాసం ఇస్తామంటూ రైతులను ఏమార్చేందుకు యత్నిస్తోంది.
» ధర లేక, కొనేవారు లేక పెద్ద ఎత్తున రైతులు పంటను తీసేస్తున్నారు. గతేడాది «ధరల పతనంతో మొదలైన సంక్షోభం ఈ ఏడాది కూడా కొనసాగుతుండడం రైతులను కలవర పెడుతోంది. గిట్టుబాటు ధరకు అమ్ముకోవాల్సిన ప్రధాన పంట ఉత్పత్తులను తక్కువ ధరకు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి రైతులకు దాపురించింది. కనీసం పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేక అల్లాడి పోతున్నారు.
1/3 వంతు కూడా సాగవ్వని వేరుశనగ
వ్యవసాయ పంటల విషయానికి వస్తే రాష్ట్రంలో సాధారణ విస్తీర్ణం 77.88 లక్షల ఎకరాలు కాగా, రాయలసీమ జిల్లాల్లో 26.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. దీంట్లో 12.43 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట మాత్రమే సాగవుతోంది. ఈ ఏడాది 14 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు లక్ష్యం కాగా, కేవలం 4లక్షల ఎకరాలకు మించి సాగవ్వని పరిస్థితి నెలకొంది.
వర్షాభావ పరిస్థితుల వల్ల వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో 19–42 శాతం మధ్యే సాగైన పంటలను చూస్తుంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖరీఫ్‌లో సీమలో ఆగస్టు 7 వరకు అనావృష్టితో ఒక్క కర్నూలు జిల్లాలో తప్ప మిగిలిన జిల్లాల్లో సాగు అంతంత మాత్రంగానే జరిగింది. సాగైన చోట కూడా వర్షాభావ పరిస్థితులకు తోడు అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు.
నష్టం భరించలేక చీనీ చెట్లు నరికేస్తున్నా
ఈ రైతు పేరు సి.కేశవ. వైఎస్సార్ కడప జిల్లా లింగాల గ్రామానికి చెందిన ఈయన 3 ఎకరాలలో చీనీ తోట సాగు చేశారు. 20 ఏళ్లుగా చీనీ పంటను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. 2023–24లో మంచి దిగుబడులతో పాటు రికార్డు స్థాయిలో ధర లభించింది. టన్ను రూ.25 వేలకు పైగా ధర పలికింది.
ప్రస్తుతం దిగుబడి బాగా వచ్చినా, మార్కెట్ యార్డులో వ్యాపారులు సిండికేట్ అయ్యారు. కొనే వారు లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ప్రస్తుతం క్వింటా రూ.3 వేల నుంచి రూ.7 వేలకు మించి పలకడం లేదు. ధరలు పతనం కావడంతో ఈ ఏడాది రూ.3 లక్షల మేర నష్టపోవాల్సి వచ్చింది. ఈ నష్టాన్ని భరించలేక చీనీ చెట్లను నరికి వేస్తున్నా అంటూ ఈ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
ధర చూస్తుంటే ఏడుపొస్తోంది
ఐదెకరాల్లో టమాటా సాగు చేశాను. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టా. వాతావరణం బాగోలేకపోవడంతో దిగుబడులు తగ్గాయి. ఎకరాకు 400 బాక్సులు (10 టన్నులు) రావాల్సింది కేవలం 50 బాక్సులు (1.25 టన్నులు) మాత్రమే వచ్చింది. ప్యాపిలి మార్కెట్‌కు 20 బాక్సులు తీసుకొస్తే బాక్స్‌కు రూ.200కు మించి ధర లభించలేదు. 2023–24లో బాక్స్ రూ.600కు అమ్ముకున్నా. ఆ ఏడాది కిలో రూ.24 పలుకగా, ప్రస్తుతం రూ.6కు మించి రావడం లేదు. బహిరంగ మార్కెట్‌లో, సూపర్ మార్కెట్లలో మాత్రం కిలో రూ.40–50కి పైగానే అమ్ముతుండటం చూసి ఏడుపొస్తోంది. – ప్రసాద్, ప్యాపిలి, కర్నూలు జిల్లా
ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు రావాలి
రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా సాగయ్యే టమాటా, అరటి, చీనీ, ఉల్లి పంట ఉత్పత్తులను కొనేవారు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది మామిడి, బొప్పాయి సహా ప్రధాన ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలను చవిచూశారు. ఇంతటి దారుణ పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవు.
ఇదే పరిస్థితి కొనసాగితే సీమ రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ధరల స్థిరీకరణ ద్వారా మార్కెట్‌లో జోక్యం చేసుకొని ధరల పతనాన్ని అడ్డుకోవడంతో పాటు ప్రతీ రైతుకు కనీస మద్దతు ధర దక్కేలా చూడాల్సిన బాధ్యత ఉంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్