మనస్థాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు కాశీబుగ్గ ఎస్‌ఐ సురేష్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం కొత్తూరు మండలం
పలాస: మనస్థాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు కాశీబుగ్గ ఎస్‌ఐ సురేష్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం కొత్తూరు మండలం కురుడు గ్రామానికి చెందిన అగతముడి శంకరరావు(16) పాతపట్నంలోని నాయుడు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శంకరరావు ఓ అమ్మాయిని ఏదో అన్నాడని అతడిని ఇద్దరు యువకులు కొట్టడంతో మనస్థాపం చెందాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కాశీబుగ్గలోని ఓ లాడ్జిలో ఓ రూము తీసుకున్నాడు. రెండురోజులుగా రూము నుంచి శంకరరావు బయటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బంది పరిశీలించింది.
దుర్వాసన వస్తుండడంతో తలుపులు తీసి చూడగా రూములోని ఫ్యానుకు శంకరరావు ఉరి వేసుకొని ఉండడాన్ని గమనించారు. విద్యార్థి బతికి ఉంటాడనే ఆశతో లాడ్జి సిబ్బంది కిందకు దించారు. అయితే మృతి చెందడంతో విషయాన్ని కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శంకరరావు బంధువులకు సమాచారం అందించారు. శంకరరావు తండ్రి సారంగధరరావు బంధువులతో కలిసి లాడ్జికి చేరుకొని కొడుకు మృతదేహం చూసి బోరున విలపించారు. శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సురేష్‌కుమార్ చెప్పారు.