తనను ఇద్దరు విద్యార్థులు వేధిస్తున్నారంటూ ఒక విద్యార్థిని పాఠశాలలో చేయి కోసుకోగా ...
పిట్టల వేమవరం (పెరవలి): తనను ఇద్దరు విద్యార్థులు వేధిస్తున్నారంటూ ఒక విద్యార్థిని పాఠశాలలో చేయి కోసుకోగా ఆ విషయమై చర్యలు తీసుకోవలసిన ఉపాధ్యాయులు వర్గాలుగా విడిపోయి దూషించుకోవడం, అసలు విషయాన్ని పక్కకు నెట్టి వీరి వాదించుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి లోనై పిల్లలను పాఠశాల నుంచి తీసుకుపోవడం వంటి ఘటనలతో పెరవలి మండలం పిట్టల వేమవరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
వివరాలిలా ఉన్నాయి. పెరవలి మండలం పిట్టల వేమవ రం ఉన్నత పాఠశాలలో మూడురోజులుగా జరుగుతున్న సంఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న ఒక బాలికను తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ప్రేమించలేదంటే నీ అంతు చూస్తాం, తరగతి గదిలోకి వెళ్లనివ్వం అంటూ శనివారం వేధించారు. ఆ విద్యార్థిని ఎవరికీ చెప్పుకోలేక, చనిపోదామనే ఉద్దేశంతో చేతులను కోసుకుంది. ఇది చూచిన విద్యార్థిని స్నేహితురాళ్లు ఉపాధ్యాయులకు చెప్పారు. దీనిపై ప్రధానోపాధ్యాయురాలు చెరుకూరి పద్మ శనివారం పెరవలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సమస్యకు కారణమైన విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విద్యార్థుల తల్లిదండ్రులు సర్దుబాటు చేసుకుంటామని తమ పిల్లలను ఇళ్లకు తీసుకువచ్చారు.
సోమవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు, ఎంఈవో, పోలీసుల సమక్షంలో బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సమస్యకు కారణమైన ఉపాధ్యాయులను బదిలీ చేయాలని లేకపోతే మా పిల్లలను తీసుకుపోతామని కొందరు తల్లిదండ్రులు చెప్పారు. పోలీసు సమక్షంలోనే 11 మంది ఉపాధ్యాయులలో తొమ్మిది మంది పిల్లల రక్షణకు బాధ్యత వహిస్తామని రాసి ఇవ్వటానికి సిద్ధమయ్యారు. మిగిలిన ఇద్దరు డీ మనోజ్, ఆంజనేయరాజు అంగీకరించకపోవటంతో సభలో గందరగోళం ఏర్పడింది. తల్లితండ్రులు మాత్రం ఈ గొడవలకు కారణం ఈ ఇద్దరేనని వీరిని పాఠశాల నుంచి బదిలీ చేయాలని లేకపోతే మా పిల్లలను పాఠశాలకు పంపించబోమని తెలిపారు. దీనిపై ఎంఈవో నల్లా సత్యనారాయణ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వటంతో ఉపాధ్యాయులు అందరినీ ఏలూరు రమ్మని ఆదేశించారు.
దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని వెళ్లిపోయారు. జరిగిన విషయాలు జిల్లా విద్యాశాఖాధికారి మధుసూదనరావుకి తెలియజేయడంతో వె ంటనే తణుకు డెప్యూటీ విద్యాశాఖాధికారి జె.స్వామిరాజును పాఠశాలకు వెళ్లి సాయంత్రం 5గంటలలోపు విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించటంతో ఆయన ఘటనా స్థలానికి వచ్చారు. ఉపాధ్యాయులను, గ్రామ పెద్దలను విచారించి తిరిగి వెళ్లిపోయారు. పెరవలి ఎస్సై డి.రవికుమార్‌ను వివరణ అడగగా ఈ సంఘటన జరిగిందని తెలిసిన వెంటనే విద్యార్థులను తీసుకువచ్చామని కాని ఇక్కడ ఉపాధ్యాయులలో విభేదాలు ఉన్నాయని చెప్పారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.