భరత్‌ అనే నేను..

Student Bharat Waiting For Helping Hands His Higher Educations - Sakshi

భరత్‌ అనే నేను.. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాను. రాత్రనక పగలనక కష్టపడి చదివి పదోతరగతి పరీక్ష ఫలితాల్లో పదికి పది జీపీఏ సాధించాను. చదువునైతే జయించ గలిగాను కానీ నా ఆర్థిక పరిస్థితులను మాత్రం జయించలేకపోతున్నాను. ఒక ప్రైవేట్‌ పాఠశాల కరస్పాండెంట్‌ ఇచ్చిన చేయూతతో ఇప్పటివరకు చదువులో రాణించగలిగాను. పదోతరగతిని పూర్తి చేసిన నేను కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులకు భారంగా మారాను. ఇక ముందు చదువును ఎలా కొనసాగించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాను.

పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల : పూతి భరత్‌ అనే ఈ విద్యార్థి ద్వారకాతిరుమలకు చెందిన పూతి శ్రీను, కొండమ్మ దంపతుల మొదటి కుమారుడు. చదవాలనే కోరిక.. చదువుపై ఆసక్తిని భరత్‌ చిన్ననాటి నుంచే పెంచుకున్నాడు. అతని తల్లిదండ్రులు కూలిపనికి వెళితేనే పూటగడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో తన బిడ్డను ఉన్నతస్థితిలో చూడాలన్న ఆకాంక్షతో వారు భరత్‌ను 1 నుంచి 3వ తరగతి వరకు పలు ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివించారు. కుటుంబ పరిస్థితులు అంతంతమాత్రం కావడంతో స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో 4వ తరగతి చదివించారు.

ఆ తరువాత మండలంలోని తిమ్మాపురం ఉషోదయా పబ్లిక్‌ స్కూల్‌లో 5వ తరగతిలో చేర్పించారు. అయితే భరత్‌ 7వ తరగతి చదువుతున్న సమయంలో తమ కుటుంబ పరిస్థితులు బాగోలేదని, ఇక ఫీజులు చెల్లించి తమ బిడ్డను చదివించలేమంటూ టీసీ ఇవ్వాల్సిందిగా ఆ పాఠశాల కరస్పాండెంట్‌ గంటా చంద్రశేఖరరావును కోరారు. బాగా చదివే భరత్‌కు టీసీ ఇవ్వడానికి మనసొప్పక ఆ కరస్పాండెంట్‌ తన సొంత ఖర్చులతో పదోతరగతి వరకు చదివించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో భరత్‌ పదికి పది జీపీఏ సాధించి సత్తా చాటి తనకు ఇంతకాలం భరోసా ఇచ్చిన కరస్పాండెంట్‌ నమ్మకాన్ని నిలిపాడు. దాతలు దయతలిచి ఆర్థిక సహకారం అందిస్తే చదువును కొనసాగిస్తానని భరత్‌ వేడుకుంటున్నాడు.

నా బిడ్డకు చేయూతనివ్వండి
భరత్‌ ఎంతో బాగా చదువుతాడు. ఇటీవల విడుదలైన పదోతరగతి పరీక్షా ఫలితాల్లో పదికి పది జీపీఏ సాధించాడు. కానీ నా బిడ్డను చదివించే స్తోమత మా దగ్గర లేదు. దాతలు స్పందించి నాబిడ్డకు చేయూతనివ్వండి– పూతి కొండమ్మ,భరత్‌ తల్లి

ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం
నా చదువుకు చేయూత దొరికితే ఐఐటీలో సీటు సాధిస్తాను. నా తల్లి ఎంతో కష్టపడితేనే గానీ మా కుటుంబం గడవదు. అలాంటి పరిస్థితుల్లో వేలకు వేలు పోసి చదవాలంటే కష్టమే. ఇప్పటి వరకు ఉషోదయ పాఠశాల కరస్పాండెంట్‌ సహకారంతో చదివాను. సహృదయంతో ఎవరైనా చేయూతనిస్తే చదువుతాను.– పూతి భరత్, విద్యార్థి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top