నోటిఫికేషన్లపై నాన్చుడు

Strong opposition from the unemployed on the state government - Sakshi

గ్రూప్‌–1, 2 పోస్టులపై ఎటూ తేల్చని రాష్ట్ర ప్రభుత్వం 

గ్రూప్‌–2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు గ్రూప్‌–1లో విలీనం ప్రతిపాదనపై  నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత

అది వీలు కాకుంటే ఇంటర్వ్యూలకైనా అవకాశం ఇవ్వాలంటూ కమిషన్‌ మెలిక

ప్రభుత్వం నుంచి స్పష్టత లేక నిలిచిన నోటిఫికేషన్లు

ఇంటర్వ్యూల పేరిట భారీగా దండుకునేందుకే ఈ ఎత్తుగడ అంటున్న నిరుద్యోగులు

పాత పద్ధతి ప్రకారమే పోస్టులు భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్‌

సాక్షి, అమరావతి: లక్షల మంది నిరుద్యోగులు దీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న గ్రూప్‌ – 1, గ్రూప్‌ – 2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. గ్రూప్‌ – 2 కేటగిరీలోని ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను ‘గ్రూప్‌ – 1 బి’ కింద భర్తీ చేసేందుకు అనుమతించాలంటూ ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపటాన్ని నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పోస్టులను గ్రూప్‌– 1లో కలిపితే నష్టపోతామనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ తాజాగా మరో ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. గ్రూప్‌ – 1లో విలీనానికి వీలుకాకుంటే గ్రూప్‌ – 2 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి నివేదించింది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో గ్రూప్‌ – 1, గ్రూప్‌ – 2 నోటిఫికేషన్ల విడుదల సందిగ్ధంలో పడింది. 

నెలలు గడుస్తున్నా విడుదల కాని నోటిఫికేషన్లు
గ్రూప్‌ – 1, గ్రూప్‌ – 2తో సహా వివిధ కేటగిరీల్లోని 18,450 పోస్టుల  భర్తీకి రాష్ట్ర మంత్రివర్గం సెప్టెంబర్‌లో ఆమోదం తెలిపింది. అయితే మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నోటిఫికేషన్లు విడుదల కాలేదు. వీటిల్లో గ్రూప్‌ – 1 పోస్టులు 182 ఉండగా, గ్రూప్‌ – 2లో 337 పోస్టులు (ఎగ్జిక్యూటివ్‌ 138, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ 199) ఉన్నాయి. 

భారీగా దండుకునే ఎత్తుగడ!
ఏపీపీఎస్సీ ఇప్పుడు మళ్లీ గ్రూప్‌ – 2 పోస్టుల భర్తీకి పాత ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌ –1లో కలిపేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అయితే నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం, ఎన్నికలు సమీపిస్తుండటంతో దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి జీవో 141 ప్రకారం గ్రూప్‌ – 2 ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌  పోస్టులను పాత పద్ధతిలోనే యధాతథంగా భర్తీ చేసేందుకు అవకాశమున్నా ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలంటూ ఏపీపీఎస్సీ కాలయాపన చేస్తోంది. గ్రూప్‌– 2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌ – 1లో విలీనం చేసేందుకు అంగీకరించకున్నా కనీసం ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకైనా అనుమతించాలంటూ తాజాగా ఏపీపీఎస్సీ కొత్త మెలిక పెడుతోంది. గతంలో గ్రూప్‌ – 2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండగా కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వాటిని రద్దు చేస్తూ గ్రూప్‌ –1 పోస్టులు, మరికొన్ని గెజిటెడ్‌ పోస్టులకు మాత్రమే ఇంటర్వ్యూలను పరిమితం చేస్తూ జీవో 420 ఇచ్చారు. అప్పటి నుంచి గ్రూప్‌ –2లో కొన్ని గెజిటెడ్‌ పోస్టులకు తప్ప ఇంటర్వ్యూలు లేవు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా సివిల్‌ సర్వీస్, మరికొన్ని కేడర్‌ పోస్టులకు తప్ప కిందిస్థాయి పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించరాదని ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రకారం చూసినా ఇంటర్వ్యూలు నిర్వహించ కూడదు. కానీ ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు ఇంటర్వ్యూలు చేపట్టేందుకు వీలుగా ఏపీపీఎస్సీ ద్వారా ప్రతిపాదనలను రూపొందించి పంపారు. ఇంటర్వ్యూల ద్వారా దండుకొనే వ్యవహారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలలో మార్కులు వేసే పేరుతో నిరుద్యోగుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు ఈ ప్రతిపాదన తెచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ గతంలో ప్రభుత్వం జీవోలు ఇవ్వగా ఇప్పుడు వాటిని నిర్వహించాలని ప్రయత్నించడం పట్ల నిరుద్యోగులు మండిపడుతున్నారు. 

ముగిసిపోతున్న గరిష్ట వయోపరిమితి
గ్రూప్స్‌ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌లో కేబినెట్‌ ఆమోదం తెలిపినా ఇప్పటివరకు నోటిఫికేషన్లు రాకపోవడం, గరిష్ట వయో పరిమితి దాటిపోతుండడంతో లక్షల మంది నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచినా నోటిఫికేషన్‌లు రాకపోవడంతో ఆ వయసు కూడా దాటిపోయే ప్రమాదం ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో గ్రూప్‌ – 2 పోస్టులకు పాత పద్ధతిలోనే వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

విలీనంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత
గ్రూప్‌ – 1 పరీక్షల్లో ప్రిలిమ్స్‌ను ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో, మెయిన్స్‌ను డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. మెయిన్స్‌లో ఆరు పేపర్లను రాయాల్సి ఉంటుంది. అభ్యర్ధులు వీటితోపాటు ఇంటర్వ్యూలను కూడా ఎదుర్కొనాలి. ఇక గ్రూప్‌ – 2 పరీక్షను ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో నిర్వహిస్తుండటంతో నిరుద్యోగులు అదే తరహాలో సన్నద్ధమవుతున్నారు. రూ.లక్షలు వెచ్చించి శిక్షణ కూడా తీసుకుంటున్నారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గ్రూప్‌ – 2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను ‘గ్రూప్‌ – 1 బి’ కింద మార్పు చేస్తూ జీవో 622 జారీచేశారు. దీనిపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో జీవో నిలిపివేశారు. అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2016లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిన సమయంలో గ్రూప్‌ – 2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌ – 1లో విలీనం చేయాలని నిర్ణయించడంతో నిరుద్యోగులు మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రతిపాదనను ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం జీవో 356ను, ఆ తరువాత 622 జీవో స్థానంలో 141 జీవోను విడుదల చేసింది. చివరకు గ్రూప్‌ – 2 పోస్టులకు పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top