బెల్టుషాపు నిర్వహణపై ఫిర్యాదు చేసినందుకు కక్షగట్టి ఇంట్లోకివచ్చి దాడి చేశారని కోవూరు మండలం పాటురుకు చెందిన పూండ్ల లోకనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
- కలెక్టరేట్‌లో ఆమరణ దీక్ష చేపట్టిన బాధిత కుటుంబం
నెల్లూరు(పొగతోట): బెల్టుషాపు నిర్వహణపై ఫిర్యాదు చేసినందుకు కక్షగట్టి ఇంట్లోకివచ్చి దాడి చేశారని కోవూరు మండలం పాటురుకు చెందిన పూండ్ల లోకనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌లో బాధిత కుటుంబం సోమవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా లోకనాథ్ మాట్లాడుతూ బెల్టుషాపు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేశామని, దీంతో 60 మంది తమ ఇంటికి వచ్చి దాడి చేశారన్నారు. దీనిపై పోలీసులు, కోవూరు తహశీల్దార్, సీఐకు ఫోన్ చేసినా స్పందించలేదన్నారు.
కోవూరు పోలీసులు తమను కొట్టుకుంటూ జీపులో తీసుకుపోయారని ఆయన ఆరోపించారు. బంధువులకు కూడా చెప్పడానికి వీల్లేకుండా సెల్‌ఫోన్ లాక్కుని రాత్రి 9 గంటల తరువాత వదిలివేశారన్నారు. బెల్టుషాపు నిర్వాహకులు తమ ఇంటి వద్దే ఉంటూ బయటకు వస్తే చంపేస్తామంటూ బెదిరించారని వాపోయారు. తమకు రక్షణ కల్పించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం జరిగేంత వరకు దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. వన్ టౌన్ సీఐ శ్రీనివాసులు వారి వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు.