తాత్కాలిక హైకోర్టు  పనులన్నీ ఎక్కడివక్కడే..

State government had told the Supreme Court two months ago that the High Court building would be completed  - Sakshi

సాక్షి, అమరావతి:  డిసెంబర్‌ నెలాఖరుకల్లా రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని సిద్ధం చేస్తామని ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం ఆఖరి నిమిషంలో చేతులెత్తేసింది. జనవరి ఒకటో తేదీ నుంచి ఏపీలో హైకోర్టు కార్యకలాపాలు నిర్వహించేలా సుప్రీంకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసిన తర్వాత భవన నిర్మాణం పూర్తి కాలేదని చావుకబురు చల్లగా చెప్పడంతో న్యాయవర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.డిసెంబర్‌ నెలాఖరుకల్లా హైకోర్టు  భవనం నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం సుప్రీంకోర్టుకు తెలిపింది. తర్వాత ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు అమరావతికి వచ్చి భవన నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌లు నిర్మాణం పూర్తవుతుందని మరోసారి చెప్పారు. ఆ తర్వాత కూడా మంత్రితో పాటు సీఎం చంద్రబాబు కూడా గడువులోగా పూర్తవుతుందని ప్రకటనలు చేశారు. 

నోటిఫికేషన్‌ వచ్చాక ప్లేటు ఫిరాయించిన బాబు 
తీరా బుధవారం సుప్రీంకోర్టు నోటిఫికేషన్‌ ఇచ్చాక చంద్రబాబు ప్లేటు ఫిరాయించేశారు. తాత్కాలిక హైకోర్టు భవనం పూర్తవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని, అప్పటివరకూ విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కార్యకలాపాలు నిర్వహించుకోచ్చని చెప్పారు. నాలుగున్నరేళ్లుగా తాత్కాలిక హైకోర్టు భవనాన్ని నిర్మించకుండా కాలక్షేపం చేసి, సుప్రీంకోర్టుకు మాత్రం అంతా సిద్ధమని చెప్పి, ఇప్పుడు తీరిగ్గా అది పూర్తి కాలేదని చెబుతుండడంపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తొమ్మిది నెలలుగా పనులు 
2.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+2 (జీ+5 ఫౌండేషన్‌)గా తాత్కాలిక హైకోర్టు నిర్మాణ పనులను ఈ ఏడాది మార్చి నెలలో చేపట్టారు. భవనానికి సంబంధించిన సివిల్‌ పనులు ఇంకా పూర్తి కాలేదు. పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. ఇంటీరియర్, విద్యుత్, ప్రధాన భవనాలకు లిఫ్టులు, అదనపు మౌలిక వసతులు, ప్రహరీగోడ, ప్రవేశ మార్గాలు, అంతర్గత రోడ్లు, పార్కింగ్, మురుగునీటి పారుదల వ్యవస్థ తదితర పనులు పూర్తవడానికి మరో ఆరు నెలలు పడుతుందని అంటున్నారు. 

కప్పిపుచ్చుకునేందుకు తంటాలు
ఈ నేపథ్యంలో తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కింది అంతస్తులో కొన్ని కోర్టు హాళ్లను ఆగమేఘాలపై సిద్ధం చేయించే పనిలో పడ్డారు. ఇతర సివిల్, ఇంటీరియర్, వసతులు లేకపోయినా లోపల హాళ్లను అందుబాటులోకి తెచ్చి నిర్మాణం పూర్తయిందని, వాటిలోనే కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని చెప్పేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కానీ జడ్జిలు, న్యాయాధికారులు, సిబ్బంది, న్యాయవాదులకు సంబంధించిన గదులు, హాళ్లు సిద్ధం కావడానికి చాలా సమయం పట్టే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ భవనం వద్దకు వెళ్లేందుకు సరైన రహదారి కూడా లేదు. రాయపూడి సమీపంలోని సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నుంచి లోనికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ భవనం ఉంది. ప్రస్తుతం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ఇంకా నిర్మాణంలోనే ఉంది.  హైకోర్టు ఉద్యోగులు, పిటీషన్‌దారులు అక్కడికి రావాలంటే నానా అగచాట్లు పడాల్సిందే. ఇవన్నీ వెంటనే చేసే పరిస్థితి లేదని తెలిసీ డిసెంబర్‌ నాటికి హైకోర్టు భవనాన్ని అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇప్పుడు జడ్జిలు, న్యాయాధికారులు, ఇతర ముఖ్యమైన ఉద్యోగులు బస చేసేందుకు హోటళ్లు, అపార్టుమెంట్లలో ఫ్లాట్లు, అద్దె ఇళ్లను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టును రోడ్డున పడేశారని న్యాయవాదులు వాపోతున్నారు. 

తాత్కాలిక సచివాలయ  నిర్మాణమూ ఇంతే 
వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయ నిర్మాణంలోనూ ప్రభుత్వం ఇలాగే ఆర్భాటానికి పోయి అభాసుపాలైంది. రికార్డు స్థాయిలో మూడు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేస్తామని ప్రకటించి పూర్తివకుండానే కొన్ని గదులను సిద్ధం చేసి ప్రారంభోత్సవాలు చేసింది. ఎలాగోలా నిర్మాణం పూర్తయిందనిపించినా పనులన్నీ నాసిరకమని అనేక సందర్భాల్లో తేలింది. చిన్న వర్షానికే మంత్రుల ఛాంబర్లలో వర్షపు ధారలు కారడం, గోడలు పగుళ్లివ్వడం వంటివి చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ భవనంలోని ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో పైకప్పు పెచ్చులూడి వర్షపు నీరు కారడం అప్పట్లో పెద్ద వివాదం మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాత్కాలిక హైకోర్టు నిర్మాణం విషయంలోనూ ఇలాగే హడావుడి చేస్తుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top