పోర్టు పనులు ప్రారంభించండి | Start port works | Sakshi
Sakshi News home page

పోర్టు పనులు ప్రారంభించండి

Jun 22 2014 2:35 AM | Updated on Oct 2 2018 5:51 PM

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే బందరు పోర్టు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని పోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు నిడుమోలు...

- ముఖ్యమంత్రికి నిడుమోలు లేఖ

మచిలీపట్నం : జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే బందరు పోర్టు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని పోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు నిడుమోలు వెంకటేశ్వరప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శనివారం లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన అనంతరం ఆరు నెలల్లోపు పోర్టు పనులను ప్రారంభిస్తామంటూ ఆయన ఇచ్చిన హామీని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 15 రోజులు గడిచినా బందరు పోర్టు అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు. మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి పోర్టు నిర్మాణంపై ఉన్నతస్థాయి కమిటీని నిర్వహించాలని కోరారు.

పోర్టు పనులు దక్కించుకున్న నవయుగ సంస్థ 2010 జూన్ ఏడో తేదీన ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని, ఇది జరిగి నాలుగేళ్లు గడిచినా ఆ సంస్థ ఫైనాన్షియల్ క్లోజర్‌కు వెళ్లలేదని తెలిపారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన 4,800 ఎకరాల భూమిని కేటాయించేందుకు నవయుగ సంస్థ ప్రభుత్వానికి మాస్టర్ ప్లాన్ పంపిందని, దీనికి ప్రభుత్వం ఇంతవరకు ఆమోదం తెలపలేదని ప్రస్తావించారు.

పోర్టు నిర్మాణానికి భూసేకరణే కీలకమని, ఈ ప్రక్రియ వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వ పరంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. భూసేకరణకు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారో, సేకరించిన భూములను పోర్టు డెరైక్టర్‌కు ఎప్పటికి అప్పగిస్తారో నిర్మాణ సంస్థ పోర్టు పనులను ఎప్పటికి ప్రారంభిస్తుందో అర్థం కాకుండా ఉందని, దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement