ఇంటర్, టెన్త్‌ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు

SSC Exams From March 23 and Inter Exams From March 4 - Sakshi

టెన్త్‌కు 2,900, ఇంటర్‌కు 1,411 కేంద్రాలు  

పరీక్షలు రాసే విద్యార్థులు 16 లక్షలు పైనే 

నేలపై కూర్చునే పరిస్థితి లేకుండా ఏర్పాట్లు

ఆన్‌లైన్‌లో హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు

సాక్షి, అమరావతి: మార్చి, ఏప్రిల్‌ నెలల్లో జరగనున్న ఇంటర్, టెన్త్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల సౌకర్యాలు మొదలుకొని మాస్‌ కాపీయింగ్‌ నిరోధం వరకు ప్రతి విషయంలోనూ ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణకు కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. మార్చి 4వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 1,411 పరీక్ష కేంద్రాల్లో జరిగే ఇంటర్‌ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అలాగే మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు 2,900 కేంద్రాల్లో జరిగే పదోతరగతి పరీక్షలు 6.30 లక్షల మంది రాయనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, ఆ సమయంలో జిరాక్స్‌ కేంద్రాలు మూసివేయిస్తామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు.

అక్రమాల నిరోధానికి జంబ్లింగ్‌ విధానంలో ఇన్విజిలేటర్లను కేటాయించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎక్కడా విద్యార్థులు కింద కూర్చుని పరీక్ష రాసే అవస్థలు లేకుండా చర్యలు తీసుకున్నారు. కాగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో స్వల్ప మార్పులు చేసిన నేపథ్యంలో విద్యార్థులను సిద్ధం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాపీయింగ్‌ నిరోధానికి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. పరీక్ష పత్రాలు లీక్‌ సమస్యను నివారించేందుకు చీఫ్‌ సూపర్‌ వైజర్‌ మినహా ఎవరి వద్దా మొబైల్‌ ఫోన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి పరీక్షల్లో చేసిన మార్పు ప్రకారం జవాబు పత్రం కేవలం 24 పేజీలతో ఉంటుంది. అడిషనల్‌ తీసుకునే అవకాశం ఉండదు. అలాగే ఈ సారి హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు ఓ యాప్‌ ను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది.

ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి సురేష్‌
పరీక్షల నిర్వాహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏర్పాట్లను వివరించారు. ఇంటర్లో గ్రేడింగ్‌ తో పాటు మార్కులు కూడా ఇస్తామన్నారు. కాగా ఇన్విజిలేటర్లుగా సచివాలయ ఉద్యోగుల సేవలు తీసుకుంటామని చెప్పారు. నూజివీడు ఐఐఐటీ ఘటనపై కమిటీ వేశామని, నివేదిక వచ్చాక చర్చలు తీసుకుంటామని ఓ ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top